ఖాజా మెరుపులతో సిడ్నీ థండర్ గెలుపు
మెల్బోర్న్: బిగ్ బాష్ లీగ్ టైటిల్ ను సిడ్నీ థండర్ కైవసం చేసుకుంది. ఆదివారం మెల్ బోర్న్ స్టార్స్ తో జరిగిన ఫైనల్ పోరులో సిడ్నీ థండర్ మూడు వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి ట్రోఫీని అందుకుంది. థండర్ ఆటగాడు ఉస్మాన్ ఖాజా(70; 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు టైటిల్ ను అందించడంలో సహకరించాడు.
టాస్ గెలిచిన సిడ్నీ థండర్ తొలుత బ్యాటింగ్ చేయాల్సిదింగా మెల్ బోర్న్ స్టార్స్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన మెల్ బోర్న్ స్టార్స్ 20.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మెల్ బోర్న్ స్టార్స్ లో పీటర్సన్ (74; 39 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకట్టుకోగా, ల్యూక్ రైట్(23), డేవిడ్ హస్సీ(21) లు ఫర్వాలేదనిపించారు. అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సిడ్నీ థండర్ కు ఖాజా, కల్లిస్ లు శుభారంభాన్ని అందించారు. కల్లిస్ (28;27 బంతుల్లో 4 ఫోర్లు) కుదురుగా ఆడగా, ఖాజా బ్యాట్ ఝుళిపించాడు. ఈ జోడీ తొలి వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యాన్నినమోదు చేసి సిడ్నీ థండర్ ను పటిష్టస్థితికి చేర్చారు.
కాగా, ఆ తరువాత షేన్ వాట్సన్(6), మైక్ హస్సీ(18), ఆండ్రీ రస్సెల్(10), బ్లిజార్డ్(16), గ్రీన్(8)లు నిరాశపరచడంతో మ్యాచ్ కాసేపు ఇరు జట్ల మధ్య దోబుచులాడింది. అయితే మెల్ బోర్న్ స్టార్స్ బౌలర్ వారల్ వేసిన చివరి ఓవర్ మూడో బంతిని రోహ్రర్ సిక్స్ గా మలచడంతో సిడ్నీ థండర్ ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే విజేతగా అవతరించింది.