ఇండియా ఓపెన్‌పై శ్రీకాంత్ కన్ను
న్యూఢిల్లీ: హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించాలనుకుంటున్నాడు. సంచలన ఆటతీరుతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి దూసుకొచ్చిన అతను తదనంతరం గాయంతో 31వ ర్యాంకుకు పడిపోయాడు. ఈ నేపథ్యంలో గ్లాస్గోలో జరగనున్న ఆ ఈవెంట్‌లో బరిలోకి దిగాలంటే వచ్చే నెల 27 కటాఫ్ తేదీకల్లా తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవాల్సి వుంటుంది. దీంతో అతను ఇండియా ఓపెన్ సహా మలేసియా, సింగపూర్ టోర్నీల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో ఉన్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందేందుకు ఈ మూడు టోర్నీలు తనకు కీలకమని శ్రీకాంత్ చెప్పాడు.
‘ఇప్పుడైతే నేను ఇండియా ఓపెన్‌పైనే దృష్టి పెట్టాను. ఇటీవల జర్మన్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఈవెంట్లలో ఆడటం ద్వారా తదుపరి టోర్నీలకు ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. తప్పకుండా ఇండియా ఓపెన్‌లో రాణిస్తాను’ అని అన్నాడు. ఈ నెల 28 నుంచి న్యూఢిల్లీలో జరిగే ఈ టోర్నీలో తనకు క్లిష్టమైన డ్రా ఎదురైనప్పటికీ ఎలాంటి ఆందోళన లేదన్నాడు. ఎలాంటి టార్గెట్లు లేకుండా బరిలోకి దిగుతానని, ప్రస్తుతానికి తొలి రౌండ్‌పైనే దృష్టిపెట్టానని చెప్పాడు. ఇక్కడ 2015లో శ్రీకాంత్ టైటిల్ నెగ్గడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ‘కాలి పాదం గాయం తర్వాత మళ్లీ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోయా. కానీ ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సంతరించుకునేందుకు నాకు కావాల్సిన సమయం లభించింది. ఇపుడు ప్రతీరోజు నా ఫిట్‌నెస్ మెరుపరుచుకునేందుకే ఎక్కువ శ్రమిస్తున్నా. ఇటీవల ఆడిన రెండు ఈవెంట్లతో నాకు కావాల్సిన మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభించింది. ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది’ అని 24 ఏళ్ల శ్రీకాంత్ అన్నాడు. ప్రస్తుత ర్యాంకుపై కలవరపడటం లేదని, దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో తనకు తెలుసన్నాడు. టోర్నీల్లో మంచి ఫలితాలు సాధిస్తే ఆటోమెటిక్‌గా ర్యాంకూ మెరుగవుతుందన్నాడు. రెండేళ్ల క్రితం ఇక్కడ విజేతగా నిలిచిన తనకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నాడు. అయితే ఈ రెండేళ్లలో ఎంతో మంది యువకులు తెరపైకి వచ్చారని కాబట్టి 100 శాతం అంకితభావాన్ని ప్రదర్శించాల్సి వుంటుందని చెప్పాడు.