సాహోరే... పంజాబ్‌ | Kings XI Punjab won by 7 runs on Mumbai Indians | Sakshi
Sakshi News home page

సాహోరే... పంజాబ్‌

Published Fri, May 12 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

సాహోరే... పంజాబ్‌

సాహోరే... పంజాబ్‌

చివరి ఓవర్‌లో గట్టెక్కిన కింగ్స్‌ ఎలెవన్‌
ప్లే ఆఫ్‌ ఆశలు సజీవం
పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్‌
సాహా మెరుపు ఇన్నింగ్స్‌


ప్లే ఆఫ్‌ రేసులో నిలిచేందుకు వరుసగా మూడు మ్యాచ్‌లను నెగ్గాల్సిన ఒత్తిడిలో ఉన్న పంజాబ్‌ ‘కింగ్స్‌’లా చెలరేగింది. వృద్ధిమాన్‌ సాహా (93 నాటౌట్‌) తుదికంటా క్రీజులో నిలిచి భారీ స్కోరు సాధించి పెట్టగా.. ఆ తర్వాత బౌలర్లు పట్టు విడవకుండా ప్రయత్నించి లీగ్‌లో టాప్‌ పొజిషన్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించారు. అయితే పొలార్డ్‌ చివరి బంతి వరకు విజయం కోసం ప్రయత్నించి పంజాబ్‌ను వణికించాడు. మ్యాక్స్‌వెల్‌ సేన ఇక తమ చివరి మ్యాచ్‌లో పుణేపై కచ్చితంగా నెగ్గి ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది.

ముంబై: వాంఖెడే మైదానం పరుగుల వర్షంతో తడిసి ముద్దయ్యింది. 231 పరుగుల లక్ష్యం.. టి20ల్లో ఇది కష్టసాధ్యమైనదే అయినా ముంబై ఇండియన్స్‌ మాత్రం చివరి బంతి వరకు పోరాడింది. అయితే ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సిన దశలో పొలార్డ్‌ ఓ భారీ సిక్స్‌ బాదినా మోహిత్‌ అద్భుతంగా బంతులేసి తమ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. దీంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 7 పరుగుల తేడాతో నెగ్గి ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. అంతకుముందు వృద్ధిమాన్‌ సాహా (55 బంతుల్లో 93 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సీజన్‌లో తొలిసారి తమ కీలక మ్యాచ్‌లో చెలరేగడంతో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (21 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), గప్టిల్‌ (18 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడారు. ఆ తర్వాత 231 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి ఓడింది. సిమన్స్‌ (32 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పార్థివ్‌ (23 బంతుల్లో 38; 7 ఫోర్లు), పొలార్డ్‌ (24 బంతుల్లో 50 నాటౌట్‌; 1 ఫోర్, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (13 బంతుల్లో 30; 4 సిక్సర్లు) చెలరేగారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ సాహాకు దక్కింది.

సాహా, మ్యాక్స్‌ దూకుడు...
ఫామ్‌లో ఉన్న ఆమ్లా లేకుండానే బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆ లోటు లేకుండా ఓపెనర్లు గప్టిల్, సాహా అద్భుత ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్‌లోనే గప్టిల్‌ రెండు, సాహా ఓ ఫోర్‌తో జట్టు 13 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఓవర్‌లో సాహా రెచ్చిపోయి మూడు ఫోర్లు బాదడంతో స్కోరు దూసుకెళ్లింది. ఈ దూకుడుకు పంజాబ్‌ 3.4 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే ఆరో ఓవర్‌లో తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచిన గప్టిల్‌ మూడో బంతికి వెనుదిరిగాడు. ఇక మ్యాక్స్‌వెల్‌ రాకతో రన్‌రేట్‌ రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. కరణ్‌ శర్మ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఆ తర్వాత హర్భజన్‌ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన తను అర్ధ సెంచరీ వైపు దూసుకెళుతున్న దశలో బుమ్రా బోల్తా కొట్టించాడు. అప్పటికే జట్టు స్కోరు 11 ఓవర్లలో రెండు వికెట్లకు 131 పరుగులకు చేరింది. ఓవర్‌ మిడ్‌వికెట్‌ మీదుగా సిక్స్‌ కొట్టిన సాహా 31 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 16వ ఓవర్‌లో మార్‌‡్ష (16 బంతుల్లో 25; 2 సిక్సర్లు) అవుటైన అనంతరం స్కోరులో కాస్త వేగం తగ్గింది.

శుభారంభం అందినా..
లక్ష్యం భారీగా ఉండటంతో ప్రారంభంలో ముంబై ఇన్నింగ్స్‌ కూడా దానికి తగ్గట్టుగానే సాగింది. ఓపెనర్లు పార్థివ్, సిమన్స్‌ ధాటిగా ఆడి శుభారంభాన్ని అందించారు. రెండో ఓవర్‌లో పార్థివ్‌ మూడు ఫోర్లు బాదాడు. ఆరో ఓవర్‌లో సిమన్స్‌ రెండు సిక్సర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 68 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్‌లోనే సిమన్స్‌ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే తొమ్మిదో ఓవర్‌ నుంచి ముంబై పతనం ప్రారంభమైంది. మోహిత్‌ శర్మ వేసిన ఆ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లతో చెలరేగిన పార్థివ్‌ నాలుగో బంతికి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలో 99 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

ఇక పదో ఓవర్‌లో సిమన్స్‌ లాంగ్‌ ఆన్‌లో ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్‌ దగ్గర గప్టిల్‌ అమాంతం పైకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్‌ తీసుకోవడంతో ముంబై షాక్‌కు గురైంది. ఆ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ (5), నితీశ్‌ రాణా (12) వరుసగా అవుట్‌ కావడంతో 22 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే పొలార్డ్, హార్దిక్‌ పాండ్యా ఒక్కసారిగా గేరు మార్చారు. హెన్రీ వేసిన 16వ ఓవర్‌లో వీరిద్దరు రెండేసి సిక్సర్లు బాదడంతో మొత్తంగా 27 పరుగులు వచ్చాయి. కానీ మరుసటి ఓవర్‌లో సందీప్‌.. పాండ్యా వికెట్‌ తీయడంతో ఐదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా కరణ్‌ శర్మ ఆడిన ఆరు బంతుల్లోనే మూడు ఫోర్లు, ఓ సిక్స్‌ బాది 19 పరుగులు చేశాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సిన దశలో ముంబై తడబడి విజయానికి దూరమైంది.

ఆదివారం వరకు వేచి చూడాలేమో!
ముంబై ఇండియన్స్‌పై పంజాబ్‌ గెలవడంతో ప్లే ఆఫ్‌ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్‌కు చేరుకోగా... మిగతా మూడు బెర్త్‌ల కోసం నాలుగు జట్లు బరిలో ఉన్నాయి.

నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో ఢిల్లీపై రైజింగ్‌ పుణే గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పుణే ఓడినా ఆ జట్టు ఆదివారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది.
 
శనివారం గుజరాత్‌ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్‌ బెర్త్‌ దక్కించుకుంటుంది. ఒకవేళ సన్‌రైజర్స్‌ ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్‌ చేరాలంటే పుణేతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు ఓడిపోవాలి.
 
శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ కోల్‌కతా ఓడితే మాత్రం ఆ జట్టు భవితవ్యం గుజరాత్, హైదరాబాద్‌... పుణే, పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ప్లే ఆఫ్‌కు చేరే అన్ని జట్లు ఏవో తేలాలంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement