
ఉప్పల్‌కు ఊపొచ్చింది...
అనుకున్నట్లుగానే సెమీఫైనల్ మ్యాచ్‌ల సందర్భంగా ఉప్పల్ స్టేడియం అభిమానులతో కళకళలాడింది. పండగ రోజు క్రికెట్ మ్యాచ్‌లతో ప్రేక్షకులు తమ వినోదాన్ని రెట్టింపు చేసుకున్నారు. తొలి మ్యాచ్ ప్రారంభం సందర్భంగా 15,121గా ఉన్న అభిమానుల సంఖ్య ఆ తర్వాత పెరుగుతూ 25,756కు చేరింది. రెండో మ్యాచ్ సమయంలోనైతే మైదానంలో 29,478 సంఖ్యలో ప్రేక్షకులు ఉండటం విశేషం.
మొదటి సెమీస్‌లో ఆశించిన స్థాయిలో మెరుపులు, భారీ స్కోర్లు లేకపోయినా అప్పుడప్పుడు ప్రేక్షకుల్లో జోష్ కనిపించింది. ముఖ్యంగా షోయబ్ మాలిక్ నాలుగు సిక్సర్లు బాదినప్పుడు స్టేడియంలో అందరూ జేజేలు పలికారు. మాలిక్‌తో పాటు సానియా పేరుతో హోరెత్తించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా గద్దర్ పాటలను కూడా వినిపించడంతో అన్ని దిక్కులా డ్యాన్స్‌లు కనిపించాయి. అయితే అన్నింటికిమించి స్టేడియంలో మూడు బిగ్ స్క్రీన్‌లపై ఆసియా క్రీడల ఫైనల్లో పాకిస్థాన్‌పై గెలిచి భారత్ స్వర్ణం సొంతం చేసుకుంది అనే స్లైడ్‌కు మాత్రం మైదానం ఏకధాటిగా ఒకే గొంతుతో హోరెత్తింది.
ఇది సుదీర్ఘంగా సాగడంతో చాలా సేపు ఆటగాళ్లు, అంపైర్లు అసలేం జరుగుతుందో కూడా అర్థం కానట్లు నివ్వెరపోవాల్సి వచ్చింది.