'108' కొడితే ఫైనల్కు..
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 108 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్ కతా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. క్రిస్ లిన్ (4), నరైన్(10), గంభీర్(12), రాబిన్ ఉతప్ప(1)లు తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఇషాంక్ జగ్గి(28), సూర్య కుమార్ యాదవ్(31) కాస్త ఫర్వాలేదనిపించడంతో కోల్ కతా స్కోరు వంద పరుగులు దాటింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా తడబడుతూనే బ్యాటింగ్ కొనసాగించింది. కీలక మ్యాచ్ లో కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్ లు రాణిస్తారని భావించినా అది జరగలేదు. వీరిద్దరూ ఆది నుంచి ముంబై బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో లిన్ భారీ షాట్ కు పోయి తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరగా, ఆపై నరైన్ దూకుడుగా ఆడబోయి స్టంప్ అవుట్ అయ్యాడు.
ఆ తరువాత స్వల్ప వ్యవధిలో ఉతప్ప, గంభీర్, గ్రాండ్ హోమ్ లు నిష్ర్రమించడంతో కోల్ కతా 31 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో ఇషాంక్ జగ్గి- సూర్యకుమార్ యాదవ్ లు మరమ్మత్తులు చేపట్టారు. ఈ జోడి 56 పరుగులు జోడించడంతో కోల్ కతా పరిస్థితి కాస్త కుదుటపడింది. అయితే జగ్గి ఏడో ఆరో వికెట్ గా అవుటైన తరువాత కోల్ కతా ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు. వరుస వికెట్లు కోల్పోతూ ముంబై బౌలింగ్ కు దాసోహమైంది. దాంతో 18.5 ఓవర్లలోనే కోల్ కతా 107 పరుగులకు ఆలౌటైంది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కరణ్ శర్మ నాలుగు వికెట్లతో కోల్ కతా పతనాన్ని శాసించగా, బూమ్రా మూడు వికెట్లు సాధించగా, మిచెల్ జాన్సన్ కు రెండు వికెట్లు దక్కాయి.