స్టీవ్ స్మిత్ కు తప్పలేదా?
ముంబై: 'నేను కెప్టెన్సీ చేసే సమయంలో పలువురి ఆటగాళ్లతో మాట్లాడతా. కానీ అందరి అభిప్రాయాల్ని మాత్రం కోరను. గేమ్ ఆడేటప్పుడు ఎక్కువ మంది అభిప్రాయాలు తీసుకుంటే మనం తీసుకునే నిర్ణయంపై నీలి మేఘాలు అలుముకుంటాయి. అందుచేత క్లియర్ గా ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండటానికి మాత్రమే యత్నిస్తా. ఒక్కొరికి వ్యూహం ఒక్కో రకంగా ఉంటుంది. వాటిని పరిశీలించే క్రమంలో వారి నిర్ణయాలను స్వాగతిస్తాను. కానీ నా మనసులో కూడా ఒక నిర్ణయముంటుంది' అని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ కు ముందు రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పిన మాట ఇది. అంటే తాను తీసుకునే తుది నిర్ణయంతోనే ఎక్కువ సంతృప్తి పొందుతాననే విషయాన్ని ఇక్కడ స్మిత్ చెప్పకనే చెప్పేశాడు.
కాగా, సోమవారం వాంఖేడ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ సందర్భంగా సహచర ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనిని ఆశ్రయించక తప్పలేదు స్టీవ్ స్మిత్ కు. ముంబై ఇండియన్స్ విజయానికి చివరి ఓవర్ లో 17 పరుగులు కావాల్సిన తరుణంలో ధోని సలహా తీసుకున్నాడు స్మిత్. మ్యాచ్ ఫలితం ఆఖరి ఓవర్ వరకూ రావడంతో మిస్టర్ కూల్ దగ్గరకు వచ్చి ఏం చేద్దాం అని అడిగాడు. ఆ సమయంలో స్మిత్ కు ధోని సలహా ఇవ్వడం మనకు వీడియోల్లో క్లియర్గా కనిపించింది. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఒత్తిడి నెలకొన్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుని జట్టుకు అనేక ఘన విజయాలు అందించిన ఘనత ధోనిది. ఆ క్రమంలోనే ధోని సలహాను తీసుకుని విజయం సాధించాడు స్మిత్. ఆ మ్యాచ్ లో పుణె మూడు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.