నా అంచనాలు తలకిందులు: స్టీవ్ స్మిత్
పుణే: ఐపీఎల్-10లో భాగంగా నిన్న (గురువారం) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంపై పుణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఫామ్ అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే విధంగా ఉండాలి. అదే ఆటగాడి లక్షణం. అయితే దురదృష్టవశాత్తూ ఆట చివరివకూ వెళ్లడం నిరాశ కలిగించిందని’ చెప్పాడు. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్న సమయంలో సిక్సర్లు కొట్టి మ్యాచ్ గెలిపించడంపై స్పందించిన స్మిత్.. పుణే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమని అభిప్రాయపడ్డాడు.
బంతిని బాదడమే పనిగా పెట్టుకోవాలని, ఫామ్ అంటూ కూర్చుంటే అద్భుతాలు చేయలేమని జట్టుకు సూచించాడు. ‘ముంబై ఇండియన్స్ మా జట్టులో ఓ స్పిన్నర్ ను టార్గెట్ చేసుకుని ఎక్కువ రన్స్ చేసేందుకు చూస్తారని భావించాను. కానీ నా అంచనాలు తలకిందులయ్యాయి. పుణే పేస్ బౌలర్ అశోక్ దిండాను టార్గెట్ చేసుకుని చివరి ఓవర్ లో హార్ధిక్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. ఏకంగా ఆ ఓవర్ లో నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్ సహా మొత్తం 30 పరుగులు రాబట్టుకున్నారు. 150-160 పరుగులకే కట్టడి అవుతుందనుకున్న ముంబై ఏకంగా 184 పరుగులు చేయడాన్ని నమ్మలేకపోతున్నాను’ అని స్మిత్ చెప్పుకొచ్చాడు.