అయితే క్లీన్‌బౌల్డ్‌ లేదా ఎల్బీడబ్ల్యూ | KL Rahul deserve the long rope he is being given as Test opener? | Sakshi
Sakshi News home page

ఇంకా ఎన్నాళ్లిలా!

Published Wed, Oct 17 2018 1:23 AM | Last Updated on Wed, Oct 17 2018 12:38 PM

KL Rahul deserve the long rope he is being given as Test opener? - Sakshi

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్టులలో బరిలోకి దిగిన 11 మంది భారత జట్టు సభ్యులలో (శార్దుల్‌ను మినహాయించి) ప్రతీ ఒక్కరు ఏదో ఒక దశలో జట్టు విజయంలో తలా ఓ చేయి వేశారు. టాప్‌–7లో ఆరుగురు కనీసం అర్ధ సెంచరీ సాధించారు, బౌలర్లలో ఉమేశ్‌ పది వికెట్లు, కుల్దీప్‌ ఐదు వికెట్ల ఘనతను సొంతం చేసుకోగా, రాజ్‌కోట్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో షమీ, అశ్విన్‌ కీలక వికెట్లతో విజయానికి బాటలు వేశారు. అయితే ఇంతటి ‘పండగ’ వాతావరణాన్ని సరిగా ఆస్వాదించలేకపోయిన దురదృష్టవంతుడు మాత్రం లోకేశ్‌ రాహుల్‌ ఒక్కడే. బలహీన ప్రత్యర్థిపై భారీగా పరుగులు సాధించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాల్సిన స్థితిలోనూ విఫలమైనందుకు రాహుల్‌ తనను తానే నిందించుకోవాలి. వరుస వైఫల్యాల తర్వాత కూడా తనను వెనకేసుకొస్తున్న టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని రాహుల్‌ నిలబెట్టేదెప్పుడు?

సాక్షి క్రీడా విభాగం : ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ గత 19 టెస్టు ఇన్నింగ్స్‌లో రెండు సార్లు మాత్రమే 50 పరుగులు దాటగలిగాడు. ఇందులో సొంత నగరంలో అఫ్గానిస్తాన్‌పై చేసిన అర్ధసెంచరీని పక్కన పెడితే ఇంగ్లండ్‌తో ఓవల్‌లో జరిగిన చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సాధించిన సెంచరీ మాత్రమే చెప్పుకోదగ్గది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కోహ్లి మినహా దాదాపు అందరూ విఫలం కాగా ఆ జాబితాలో రాహుల్‌ కూడా ఉన్నాడు. ఆ పర్యటనలో చివరి ఇన్నింగ్స్‌కు ముందు అతను వరుసగా 4, 13, 8, 10, 23, 36, 19, 0, 37 (మొత్తం 150) పరుగులు సాధించాడు. ఎలా చూసినా ఇది భారీ వైఫల్యం కిందే లెక్క.అదృష్టవశాత్తూ మురళీ విజయ్‌ తరహాలో సిరీస్‌ మధ్యలో గానీ సిరీస్‌ తర్వాత ధావన్‌లా కానీ అతనిపై వేటు పడలేదు. నిజానికి విండీస్‌ సిరీస్‌కు ముందు ఓవల్‌లో చేసిన 149 పరుగులే అతడిని కాపాడాయి. అప్పటికే సిరీస్‌ చేజారిపోయి చివరి మ్యాచ్‌లోనూ గెలిచే అవకాశాలు సన్నగిల్లిన స్థితిలో పోయేదేమీ లేదన్నట్లుగా ఎడాపెడా బాదిన ఆ ఇన్నింగ్స్‌ను బట్టి ఒక ఓపెనర్‌ సత్తాను అంచనా వేయడం పూర్తిగా తప్పు. అయితే ‘అపార ప్రతిభ’ కలవాడంటూ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ కూడా అతనికి గట్టిగా మద్దతు పలుకుతుండటంతో రాహుల్‌కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. సరిగ్గా గమనిస్తే ఇంత నిలకడగా అటు విదేశాల్లో, ఇటు సొంతగడ్డపై విఫలమవుతున్న ఒక ఆటగాడికి ఇన్ని అవకాశాలు రావడం నిజంగా ఆశ్చర్యకరం.  

బౌల్డ్‌ లేదా ఎల్బీడబ్ల్యూ... 
రాహుల్‌ 51 ఇన్నింగ్స్‌ల కెరీర్‌లో 5 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే అతి పేలవంగా ఆడిన సందర్భాలు అంతకంటే చాలా ఎక్కువ. కనీస సమయం పాటు కూడా క్రీజ్‌లో నిలబడకుండా ఆరంభంలోనే రాహుల్‌ చాలాసార్లు వికెట్‌ చేజార్చుకున్నాడు. తాజాగా రాజ్‌కోట్‌ టెస్టులో తొలి ఓవర్లోనే ఔటైన అతను... హైదరాబాద్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 25 బంతులకే వెనుదిరిగాడు.  కెరీర్‌లో ఏకంగా 24 సార్లు అతని ఆట 25 బంతుల్లోపే ముగిసిపోయింది! ఒక ఓపెనర్‌ నుంచి ఇలాంటి ఆటను ఏ జట్టూ ఆశించదు. ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ సాధ్యమైనంత ఎక్కువసేపు మైదానంలో నిలబడటం, తొందరగా వికెట్‌ కోల్పోకుండా జట్టు ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేయడం ఓపెనర్ల సహజ లక్షణాలు. ఈ రకంగా పోలిస్తే రాహుల్‌కంటే విజయ్‌ ఎంతో మెరుగు. ఇక అతని బ్యాటింగ్‌లో ఇటీవల కనిపిస్తున్న అతి పెద్ద లోపం ఫుట్‌వర్క్‌. ఆరంభంలో పేసర్లను ఎదుర్కొనేందుకు కావాల్సిన పాదాల కదలిక, చురుకుదనం అతనిలో కనిపించడం లేదు. సరిగ్గా చెప్పాలంటే ‘ఔట్‌ స్వింగర్‌’లు అంటే అతను ముందే భయపడిపోతున్నట్లుగా కనిపిస్తోంది. క్రీజ్‌లో చిక్కుకుపోయి ఎల్బీడబ్ల్యూ కావడం లేదంటే బ్యాట్, ప్యాడ్‌ మధ్యలోంచి బంతి వెళ్లిపోయేలా ఆడి క్లీన్‌ బౌల్డ్‌ కావడం అలవాటుగా మారిపోయింది. లార్డ్స్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌ నుంచి హైదరాబాద్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌ వరకు వరుసగా 9 ఇన్నింగ్స్‌లలో అతను 5 సార్లు క్లీన్‌బౌల్డ్‌ కాగా, మరో 4 సార్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. దీనిని సరిదిద్దేందుకు, అతనిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు బంగర్‌ ఏమైనా ప్రయత్నించాడా లేదా అనేదానిపై స్పష్టతే లేదు.  

ఆస్ట్రేలియాలో ఎలా?  
తాజా వైఫల్యానికి ముందు అతను 11 వరుస ఇన్నింగ్స్‌లలో 9 అర్ధ సెంచరీలు సాధించాడు. వీటిలో 9 భారత గడ్డపై రాగా, మరో 2 శ్రీలంకలో స్కోరు చేశాడు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా నాటి రాహుల్‌కు, ప్రస్తుతం అతని ఆటకు చాలా తేడా కనిపిస్తోంది. రాజ్‌కోట్‌లో వైఫల్యం తర్వాత హైదరాబాద్‌ టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేయాలంటూ అన్ని వైపుల నుంచి వ్యాఖ్యలు వినిపించిన సమయంలో కూడా కోహ్లి మద్దతు ఉండటంతో రాహుల్‌కు ఇబ్బంది ఎదురు కాలేదు. కానీ అక్కడైనా భారీ స్కోరు చేసే అవకాశాన్ని అతను చేజార్చుకున్నాడు. 72 పరుగుల లక్ష్యంతో విజయం ఖాయమైన స్థితిలో చేసిన 33 పరుగులను పరిగణలోకి తీసుకోనవసరం లేదు కాబట్టి విండీస్‌పై అతను విఫలమైనట్లుగానే భావించాలి. మరి సొంతగడ్డపై విండీస్‌పైనే పరుగులు సాధించలేని ఆటగాడు ఆస్ట్రేలియాలో ఎలా ఆడగలడంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. అలాంటి ఆటగాడిపై జట్టు ఎలా విశ్వాసం ఉంచగలదు? ఓపెనర్‌గా పృథ్వీ షా దూసుకొచ్చినా... విజయ్, ధావన్‌ వైఫల్యాల తర్వాత మరో సీనియర్‌ అవసరం ఉంటుందనే కారణం ఒక్కటే ఆస్ట్రేలియా పర్యటనకు కూడా రాహుల్‌కు అవకాశం కల్పించవచ్చు. కౌంటీల్లో ప్రదర్శనతో విజయ్‌కు మరో అవకాశం ఇస్తారా అనేది చెప్పలేం. కాబట్టి రాహుల్‌ స్థానానికి అప్పుడే వచ్చిన ప్రమాదమేమీ లేదు. అయితే తాజా ఫామ్‌తో గనక అతను అక్కడ ఓపెనర్‌గా అడుగు పెడితే ఆసీస్‌ పిచ్‌లపై స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌ ముందు ఈ ఓపెనర్‌కు విషమ పరీక్ష ఎదురు కావచ్చు. దాదాపు నాలుగేళ్ల క్రితం సిడ్నీలో అద్భుత సెంచరీతో రాహుల్‌ తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. ఇప్పటికే విమర్శల పాలవుతున్న రాహుల్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఆసీస్‌ గడ్డ మళ్లీ వేదిక కాగలదు. అయితే ఆలోగా తన బ్యాటింగ్‌లోని సాంకేతిక లోపాలు సవరించుకునేందుకు మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. లేదంటే నాడు రోహిత్‌ శర్మ స్థానంలో కొత్త కుర్రాడిగా తనను ఎంపిక చేసినట్లే ఇప్పుడు మయాంక్‌ అగర్వాల్‌ను తీసుకొస్తే తన కెరీర్‌కే దెబ్బ కాగలదు!

లోకేశ్‌ రాహుల్‌ ఇప్పుడు సాంకేతిక సమస్యతో పాటు మానసికంగా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. షాట్‌ ఆడేటప్పుడు అతను తలను నిటారుగా ఉంచకుండా ఒక వైపు వంగిపోతున్నాడు.దాంతో శరీరం వికెట్లకు అడ్డంగా వస్తోంది. ఫలితంగా మళ్లీ మళ్లీ బౌల్డ్‌ లేదా ఎల్బీ అవుతున్నాడు. దీనిని అతను తొందరగా సరిదిద్దుకోవాలి. వరుసగా ఒకే తరహాలో ఔట్‌ కావడం కూడా అతనిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 
– సునీల్‌ గావస్కర్‌    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement