హార్దిక్ పాండ్యా ఎప్పుడో?
మొహాలీ: గత నెల్లో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను అప్పుడే గాయాల బెడద వేధిస్తోంది. మొహాలీలో ట్రైనింగ్ సెషన్లో పాండ్యాకు గాయం కావడంతో అతని టెస్టు అరంగేట్రం మరింత ఆలస్యం కానుంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా ప్రాబబుల్స్లో పాండ్యా ఉన్నా అతను ఇంకా టెస్టు మ్యాచ్ ఆడలేదు.
ఇటీవల జరిగిన విశాఖ టెస్టులో పాండ్యా కు తుది జట్టులో అవకాశం దక్కుతుందని తొలుత భావించారు. కాగా, ఆ మ్యాచ్ లో జయంత్ యాదవ్ టెస్టుల్లో అరంగేట్రం చేయడంతో పాండ్యాకు అవకాశం దక్కలేదు. రాజ్ కోట్ టెస్టులో ఆడిన అమిత్ మిశ్రాకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. జయంత్కు జట్టులో స్థానం కల్పించారు. మరొకవైపు గాయపడ్డ కేఎల్ రాహుల్ స్థానంలో కరణ్ నాయర్ ను మొహాలీ టెస్టు ద్వారా అవకాశం కల్పించారు. చివరి నిమిషంలో రాహుల్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం కావాల్సి రావడంతో నాయర్ టెస్టుల్లో అరంగేట్రం చేయడానికి మార్గం సుగమైంది. కాగా, అదే క్రమంలో హార్దిక్ కుడి భుజానికి గాయం కావడంతో అతని ఎంపికను సెలక్టర్లు పక్కక పెట్టక తప్పలేదు.
ఈ ఏడాదే అంతర్జాతీయ టీ 20ల్లో, వన్డేల్లో అరంగేట్రం చేసిన పాండ్యా.. టెస్టుల్లో అరంగేట్రం చేయడం ప్రస్తుతానికి డైలమాలో పడింది. తాజాగా భారత టెస్టు స్వ్కాడ్ నుంచి పాండ్యాను విడుదల చేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా అతన్ని ఒక స్పెషలిస్టు డాక్టర్ను కలవాల్సిందిగా బీసీసీఐ వైద్య బృందం పాండ్యాకు సూచిస్తూ అతన్ని టెస్టు జట్టు నుంచి విడుదల చేసింది. దాంతో తదుపరి రెండు టెస్టుల్లో పాండ్యా ఆడే అవకాశం దాదాపు లేనట్లే కనబడుతోంది. ఇంగ్లండ్ తో సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో పాండ్యా ఒక్కడే టెస్టు అరంగేట్రం చేయాల్సి ఉంది. ఇప్పటికే జయంత్ యాదవ్, కరణ్ నాయర్లు టెస్టు అరంగేట్రం చేయడంతో ఇక పాండ్యా తొలి టెస్టు ఎప్పుడు అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలింది. మరొకవైపు ముంబైలో జరిగే నాల్గో టెస్టులో కేఎల్ రాహుల్ ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. నాల్గో టెస్టు నాటికి రాహుల్ తన ఫిట్ నెస్ నిరూపించుకుని తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఉంది.