గాలే మన గుప్పిట్లోకి... | Kohli, Mukund put game beyond Lanka's reach after rain | Sakshi
Sakshi News home page

గాలే మన గుప్పిట్లోకి...

Published Sat, Jul 29 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM

గాలే మన గుప్పిట్లోకి...

గాలే మన గుప్పిట్లోకి...

498 పరుగుల ఆధిక్యంలో భారత్‌
రెండో ఇన్నింగ్స్‌ 189/3
రాణించిన ముకుంద్, కోహ్లి
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 291  


శ్రీలంక అత్యద్భుత స్థాయి ప్రదర్శన చేస్తే తప్ప...  వరుణుడు నిలువరిస్తే తప్ప... గాలే టెస్టును భారత్‌ ఇక దక్కించుకున్నట్టే! తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 291 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా ఏకంగా 309 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది.  శ్రీలంక గడ్డపై భారత్‌కు ఇదే   అత్యధిక ఆధిక్యం. ఆ తర్వాత లంకకు ఫాలోఆన్‌ ఇవ్వకుండా బరిలోకి దిగిన భారత్‌కు రెండో     ఇన్నింగ్స్‌లో అభినవ్‌ ముకుంద్, విరాట్‌ కోహ్లి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత్‌ ఆధిక్యం 498 పరుగులకు చేరింది. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో లంక ఈ మ్యాచ్‌ను నిలబెట్టుకోవడం దాదాపు అసాధ్యమే.  

గాలే: రెండేళ్ల క్రితం ఇదే వేదికపై శ్రీలంక చేతిలో ఎదురైన దారుణ ఓటమికి భారత జట్టు ఈసారి దిమ్మ తిరిగే రీతిలో సమాధానం ఇవ్వడం ఖాయమైంది. ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌ (116 బంతుల్లో 81; 8 ఫోర్లు), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (114 బంతుల్లో 76 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 46.3 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. దీంతో భారత్‌ 498 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. అంతకుముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది.

దిల్‌రువాన్‌ పెరీరా (132 బంతుల్లో 92 నాటౌట్‌; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూస్‌ (130 బంతుల్లో 83; 11 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడారు. స్పిన్నర్‌ రవీంద్ర జడేజాకు మూడు, షమీకి రెండు వికెట్లు దక్కాయి. రెండో సెషన్‌లో వర్షం కారణంగా 86 నిమిషాలపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దాంతో ఆటను సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించారు.

 సెషన్‌–1: ఆదుకున్న పెరీరా, మాథ్యూస్‌
మూడో రోజు ఆటలోనూ మాథ్యూస్, పెరీరా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో లంక ఇన్నింగ్స్‌ తొలి గంటసేపు సాఫీగా సాగింది. ఆ తర్వాత జడేజా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చిన మాథ్యూస్‌ 59వ ఓవర్‌లో వెనుదిరిగాడు. దీంతో వీరిద్దరి మధ్య ఆరో వికెట్‌కు 62 పరుగుల విలువైన భాగస్వామ్యం ముగిసింది. రెండు ఓవర్ల అనంతరం ఎల్బీ అయ్యే ప్రమాదాన్ని రివ్యూ అడిగి తప్పించుకున్న పెరీరా... 94 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అలాగే అతను ఏడో వికెట్‌కు హెరాత్‌ (9)తో కలిసి 36, ప్రదీప్‌ (10)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 39 పరుగులను జోడించాడు. ప్రదీప్‌ను అవుట్‌ చేసిన పాండ్యా టెస్టుల్లో తొలి వికెట్‌ సాధించాడు.
ఓవర్లు: 33 పరుగులు: 135 వికెట్లు: 3

సెషన్‌–2: ధావన్, పుజారా విఫలం
లంచ్‌ విరామం అనంతరం మరో తొమ్మిది బంతుల్లోనే శ్రీలంక ఇన్నింగ్స్‌ ముగిసింది. లంక చివరి వికెట్‌ను జడేజా తీయడంతో పెరీరా సెంచరీకి సహకారం లేకుండా పోయింది. గాయం కారణంగా గుణరత్నే బ్యాటింగ్‌కు దిగలేదు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 56 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. పెరీరా బౌలింగ్‌లో ఓపెనర్‌ ధావన్‌ (14 బంతుల్లో 14; 3 ఫోర్లు) వైడ్‌ బంతిని ఆడబోయి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో చిక్కాడు. పుజారా (15) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరగ్గా ఆ వెంటనే భారీ వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో టీ బ్రేక్‌ను కూడా ఈ సమయంలోనే ముగించారు.
ఓవర్లు: 1.3 పరుగులు: 2 వికెట్లు: 1 (శ్రీలంక)
ఓవర్లు: 16.5 పరుగులు: 56 వికెట్లు: 2 (భారత్‌ )


సెషన్‌–3: ముకుంద్, కోహ్లి జోరు
ఆఖరి సెషన్‌లో అభిమన్యు ముకుంద్, విరాట్‌ కోహ్లి లంక బౌలర్లను ఆడుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో తమ వైఫల్యాన్ని అధిగమిస్తూ వీరిద్దరూ ఈసారి అద్భుత ఆటతో చెలరేగారు. లంక బౌలర్ల నుంచి ఈ జోడికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాక పోవడంతో స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించారు. ఈ క్రమంలో ముకుంద్‌ తన కెరీర్‌లో రెండో అర్ధ సెంచరీని 78 బంతుల్లో అందుకున్నాడు. అటు వేగంగా ఆడిన కోహ్లి కూడా 68 బంతుల్లో ఈ ఫీట్‌ను సాధించి జోరును చూపాడు. మూడో రోజు చివరి ఓవర్‌లో ముకుంద్‌ తన ఎల్బీ అవుట్‌పై రివ్యూకు వెళ్లినా నిరాశ ఎదురైంది. దీంతో మూడో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
ఓవర్లు: 29.4 పరుగులు: 133 వికెట్లు: 1

ప్రస్తుతం గురించే ఆలోచిస్తా...
గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో తానేంటో నిరూపించుకునేందుకు అవకాశం దక్కిందని ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌ అన్నాడు. మూడో రోజు ఆట ముగిశాక ముకుంద్‌ మాట్లాడుతూ... ‘మరో టెస్టు గురించి ఆలోచన లేదు. ఓ దశలో నేను నా ఫస్ట్‌ క్లాస్‌ జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాను. ఇప్పుడు భారత జట్టులో ఉన్నానంటే అది నాకు పెద్ద బోనస్‌. ఒక్కో మ్యాచ్‌ గురించే నా ఆలోచనంతా.. జూనియర్‌ స్థాయిలో నేను కోహ్లి, జడేజా ఇతర ఆటగాళ్లతో చాలా మ్యాచ్‌లు ఆడాను. అందుకే నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఫీల్డింగ్‌లో క్యాచ్, రనౌట్‌ చేయడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే 81 పరుగుల వద్ద అవుట్‌ కావడం నిరాశపరిచింది’ అని అన్నాడు.  

2011 జూన్‌లో వెస్టిండీస్‌పై కింగ్‌స్టన్‌లో జరిగిన మ్యాచ్‌ ద్వారా  ముకుంద్, కోహ్లి టెస్టు క్రికెట్‌లో ఒకేసారి అరంగేట్రం చేశారు. ఆ టెస్టులో ముకుంద్‌ అర్ధ సెంచరీ చేశాక మళ్లీ గాలే టెస్టులో మరో ఫిఫ్టీ చేశాడు. మరోవైపు ఈ వ్యవధిలో కోహ్లి ఏకంగా 16 సెంచరీలు సాధించడం విశేషం. అంతేకాకుండా ఆరేళ్లలో ముకుంద్, కోహ్లి కలిసి బ్యాటింగ్‌ చేయడం ఇదే తొలిసారి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement