సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా రంగంలో కూడా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు (కేటీఆర్) అన్నారు. ఇందుకోసం త్వరలోనే కొత్త క్రీడా విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం తొలి సారి సమావేశమైంది. ఇందులో కేటీఆర్‌తో పాటు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్రీడా సౌకర్యాలు, అకాడమీలు, కోచ్‌లు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ‘శాట్స్’ అధికారులు కేటీఆర్‌కు అందజేశారు. కొత్త క్రీడా విధానానికి రూపకల్పన చేయాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. తర్వాతి సబ్ కమిటీ సమావేశంలో క్రీడాకారులు, కోచ్‌లను కూడా ఆహ్వానించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment