
సంగక్కర స్పెషల్!
కొలంబో: క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో శ్రీలంక బ్యాట్స్ మన్ కుమార్ సంగక్కర్ రెండో స్థానంలో నిలిచాడు. మూడు ఫార్మాట్లలో(టెస్టులు, వన్డేలు, టి20) ఇప్పటివరకు అతడు 27,966 పరుగులు చేశాడు. భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సంగక్కర కొలంబోలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తర్వాత క్రికెట్ జీవితానికి వీడ్కోలు చెబుతానని సంగక్కర ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు 133 టెస్టులు ఆడిన సంగక్కర 12,350 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సంగక్కర ఐదో స్థానంలో ఉన్నాడు. 85 టెస్టుల్లో అతడు వికెట్ కీపింగ్ చేయలేదు. ఈ మ్యాచుల్లో 67.4 సగటుతో 9,233 పరుగులు సాధించడం విశేషం. 11 డబుల్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. బ్రాడ్ మన్(12) టాప్ లో ఉన్నాడు. సంగక్కర ఖాతాలో 38 టెస్టు సెంచరీలు ఉన్నాయి.
టెస్టుల్లో వేగంగా 8, 9, 11, 12 వేల పరుగులు పూర్తి చేసిన ఘనత కూడా సంగక్కర పేరిట ఉంది. టెస్టుల్లో సంగక్కర బౌలింగ్ కూడా చేశాడు. నాలుగు ఇన్నింగ్స్ లో 4 బంతులు విసిరిన అతడు ఒక వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు.
404 వన్డేలు ఆడిన సంగక్కర 41.98 సగటుతో 14234 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 93 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.