పెరీరాపై నాలుగేళ్ల నిషేధం!
కొలంబో: శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ పెరీరాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశాలున్నాయి. డోపింగ్ పరీక్షలో భాగంగా అతడి ‘బి’ శాంపిల్ కూడా పాజిటివ్‌గా తేలడంతో వేటు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఐసీసీ తమకు చెప్పినట్టు శ్రీలంక క్రీడా మంత్రి దయసిరి జయశేఖర తెలిపారు. ఇటీవలి పాక్ పర్యటన సందర్భంగా తీసుకున్న యూరిన్ శాంపిల్‌లో పెరీరా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది.
వెంటనే ఈనెల ఆరంభంలోనే కివీస్‌తో జరుగుతున్న సిరీస్ నుంచి పెరీరాను తొలగించారు. ‘దీన్ని మేం అప్పీల్ చేయాలని భావిస్తున్నాం. ఎందుకంటే గత నాలుగు పర్యాయాల్లో అతడి విషయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ కష్టకాలంలో మేం పెరీరాకు అన్ని విధాలా సహాయం అందిస్తాం’ అని జయశేఖర తెలిపారు. గతంలో 2011 ప్రపంచకప్ సందర్భంగా లంక బ్యాట్స్‌మన్ ఉపుల్ తరంగ డోపింగ్ టెస్టులో విఫలమై మూడు నెలల సస్పెన్షన్ ఎదుర్కొన్నాడు.