బెంగళూరు బేలగా...
►మళ్లీ చిత్తుగా ఓడిన కోహ్లి జట్టు
► 19 పరుగులతో పంజాబ్ విజయం
►గెలిపించిన సందీప్, అక్షర్
ఒకప్పుడు ఐపీఎల్‌లో పరుగుల వరద పారించి బ్యాటింగ్‌లో రికార్డులు సృష్టించడాన్ని అలవాటుగా మార్చుకున్న ఆ జట్టుకు ఇప్పుడు పరుగులు తీయడమే గగనంగా మారింది. స్టార్ ఆటగాళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడి విఫలమవుతున్న వేళ బెంగళూరు మరో పరాభవాన్ని మూటగట్టుకుంది. 139 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక కోహ్లి సేన చతికిలపడింది. అక్షర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు సందీప్ శర్మ సూపర్ బౌలింగ్ పంజాబ్‌కు కీలక విజయాన్ని అందించింది.
బెంగళూరు: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కు మరో ఓటమి ఎదురైంది. శుక్రవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19 పరుగుల తేడాతో ఆర్‌సీబీపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. మన్‌దీప్ సింగ్ (40 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు టాప్ స్కోరర్‌గా నిలవగా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సందీప్ శర్మ (3/22), అక్షర్ పటేల్ (3/11) ప్రత్యర్థిని కుప్పకూల్చారు. ఐదో విజయంతో పంజాబ్ తమ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
అక్షర్ ఒక్కడే...
ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ మెరుపు బ్యాటింగ్ మినహా పంజాబ్ ఇన్నింగ్స్ అతి సాధారణంగా సాగింది. పిచ్ నెమ్మదిగా ఉండటంతో బ్యాట్స్‌మెన్ ప్రతీ పరుగు కోసం శ్రమించాల్సి వచ్చింది. తొలి ఓవర్లోనే ఆమ్లా (1) అవుట్ కాగా, కొద్దిసేపటికే గప్టిల్ (9) కూడా వెనుదిరిగాడు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాన్ మార్‡్ష (17 బంతుల్లో 20; 3 ఫోర్లు), వోహ్రా (28 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్), సాహా (25 బంతుల్లో 21; 1 ఫోర్) కొద్ది సేపు క్రీజ్‌లో నిలిచినా... ధాటిగా ఆడటంలో విఫలమయ్యారు.
మ్యాక్స్‌వెల్ (6) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్ మెల్లగా సాగింది. ఈ దశలో అక్షర్ జట్టుకు ఆపద్భాంధవుడిగా మారాడు. ముందుగా చహల్ ఓవర్లో ఫోర్, సిక్స్‌తో అతను జోరును ప్రదర్శించాడు. కీలకమైన 19వ ఓవర్‌ను అనికేత్ మెయిడిన్‌గా వేయడం విశేషం. అయితే వాట్సన్ వేసిన ఆఖరి ఓవర్లో అక్షర్ చెలరేగడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఈ ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో పటేల్ 19 పరుగులు రాబట్టాడు. బెంగళూరు బౌలర్లలో అనికేత్ (2/17), చహల్ (2/21) రాణించారు.
సందీప్ హవా...
సొంత మైదానంలో సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముగ్గురు భారీ హిట్టర్లు కలిపి చేసిన పరుగులు 16 మాత్రమే! సందీప్ శర్మ చక్కటి బంతులకు తోడు నిర్లక్ష్యపూరిత బ్యాటింగ్ బెంగళూరును ఇబ్బందుల్లో పడేసింది. గేల్ (0), కోహ్లి (6), డివిలియర్స్ (10) ముగ్గురూ దాదాపు ఒకే తరహాలో సందీప్ పేస్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ముందుకు దూసుకొచ్చి అవుటయ్యారు. వరుసగా తన తొలి మూడు ఓవర్లలో ఈ వికెట్లు తీసిన సందీప్... ఒకే ఇన్నింగ్స్‌లో గేల్, కోహ్లి, డివిలియర్స్‌లను అవుట్ చేసిన తొలి బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. మరో ఎండ్ నుంచి మన్‌దీప్ కొంత పోరాడే ప్రయత్నం చేసినా, జాదవ్ (6), వాట్సన్ (3) విఫలం కావడంతో ఆర్‌సీబీ కోలుకోలేకపోయింది. మ్యాక్స్‌వెల్ తన తొలి ఓవర్లోనే మన్‌దీప్‌ను బౌల్డ్ చేయడంతో బెంగళూరు గెలుపు ఆశలు ఆవిరైపోయాయి. పవన్ నేగి (23 బంతుల్లో 21; 2 ఫోర్లు) చివర్లో పోరాడినా లాభం లేకపోయింది.