పంజాబ్ దూకుడు కొనసాగిస్తుందా..?
►నేడు బెంగళూరుతో కింగ్స్ ఢీ
►క్వాలిఫై కోసం పంజాబ్ పోరు
►పరువు కోసం కోహ్లిసేన ఆరాటం
బెంగళూరు: ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలనే లక్ష్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చివరి మ్యాచ్‌ల్లో ఢిల్లీపై పది వికెట్లతో గెలుపొందిన మ్యాక్స్‌వెల్‌సేన.. ఈ మ్యాచ్‌లో నెగ్గి నాకౌట్ సమరానికి మరింత చేరువ కావాలని యోచిస్తోంది. మరోవైపు ఈ సీజన్‌లో ఎనిమిది ఓటములతో ప్లే ఆఫ్‌కు దూరమైన బెంగళూరు పరువు కోసం ఈ మ్యాచ్‌లో నెగ్గాలని కృతి నిశ్చయంతో ఉంది.
పంజాబ్ దూకుడు..
ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పంజాబ్.. అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. అనంతరం తేరుకున్న పంజాబ్ తను ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సమష్టి విజయం సాధించింది. తొలుత పేసర్లు చెలరేగడంతో ఢిల్లీని కేవలం 67 పరుగులకు కుప్పకూల్చారు. పంజాబ్ జోరుకు టోర్నీ చరిత్రలోనే ఢిల్లీ తన అత్యల్ప స్కోరును నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌లో రెచ్చిపోయిన మ్యాక్స్‌వెల్‌సేన కేవలం 7.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా న్యూజిలాండ్ విధ్వంసక ప్లేయర్ మార్టన్ గప్టిల్ కేవలం 27 బంతుల్లోనే అర్ధసెంచరీ నమెదుచేయడం విశేషం. ఓవరాల్‌గా తొమ్మిది మ్యాచ్‌లాడిన పంజాబ్ నాలుగు విజయాలు, ఐదు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో ఎనిమిది పాయింట్లతో ఐదోస్థానంలో కొనసాగుతోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే హషీమ్ ఆమ్లా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
ఎనిమిది మ్యాచ్‌ల్లో 63 సగటుతో 315 పరుగులు నమోదు చేశాడు. అయితే కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 193 పరుగులతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మనన్ వోహ్రా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మాత్రమే సత్తాచాటాడు. వీరు త్వరలో గాడిలో పడాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. మార్టిన్ గప్టిల్ రెండు మ్యాచ్‌ల్లో 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. షాన్ మార్‡్ష, వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే సందీప్ శర్మ ఎనిమిది మ్యాచ్‌ల్లో 11 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పదునైన బంతులతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను సందీప్ కుప్పకూల్చాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 10 వికెట్లతో రాణిస్తున్నాడు. వరుణ్ ఆరోన్, మోహిత్ శర్మ ఫర్వాలేదనిపిస్తున్నారు.
ఈ సీజన్‌లో ఇరుజట్లు పరస్పరం ఓ సారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో పంజాబ్ ఘన విజయం సాధించింది. మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. పంజాబ్‌కు మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయం సాధించాలని కృత నిశ్చయంతో ఉంది. భారత మాజీ విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మార్గదర్శకత్వంలో ఈసారి ఎలాగైనా నాకౌట్‌కు చేరాలని భావిస్తోంది. దీంతో గతేడాది నమోదు చేసిన చెత్త ప్రదర్శనను మరిపించాలని ఆశిస్తోంది.
‘బెంగ’ తీరేనా...?
గతేడాది అద్భుత ఆటతీరుతో రన్నరప్‌గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి మాత్రం చెత్త ప్రదర్శననను నమెదు చేస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది ఓటములు నమోదు చేసిన బెంగళూరు అధికారికంగానే ప్లే ఆఫ్స్‌కు దూరమైన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఓవరాల్‌గా 11 మ్యాచ్‌లాడిన బెంగళూరు కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. ముఖ్యంగా బెంగళూరు చివరగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఒక్క పాయింట్‌ను సాధించింది.
దీంతో ఓవరాల్‌గా ఐదు పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన కోహ్లి, డివిలియర్స్, గేల్‌లాంటి ఆటగాళ్లున్నా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 49 పరగులకు కుప్పకూలింది. మరోవైపు రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌పై 158 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు కనీసం 100 పరుగుల మార్కును సైతం దాటలేకపోయింది. ఏదీ ఏమైనా నాకౌట్ దశకు అర్హత పొందకపోయినా ఇతర జట్ల అవకాశాలపై ఇప్పుడు బెంగళూరు ప్రభావం చూపనుంది. కోహ్లిసేనకు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఎలాగైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఆశిస్తోంది. దీంతో బెంగళూరుతో తలపడాల్సిన పంజాబ్, ఢిల్లీ, కోల్‌కతా కొంచెం కంగారుపడుతున్నాయి.
ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కేదార్ జాదవ్ 10 మ్యాచ్‌ల్లో 241 పరుగులతో జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి విధ్వంసక ఆటగాళ్లు ఈ సీజన్‌లో అనుకన్నంత మేరకు రాణించలేకపోయారు. మిగతా మ్యాచ్‌ల్లోనైన వీరు తమ బ్యాట్‌కు పదును పెట్టాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే యజ్వేంద్ర చహల్ 11 వికెట్లతో సత్తా చాటాడు. పవన్ నేగి 10 వికెట్లతో ఆకట్టుకున్నాడు. షేన్ వాట్సన్, స్టువర్ట్ బిన్నీ, శ్రీనాథ్ అరవింద్ తదీతరులు బంతితో రాణించాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతులో ఎదురైన ఓటమికి ఇప్పుడు బదులు తీర్చుకునే అవకాశం బెంగళూరుకు చిక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోహ్లిసేన కృతనిశ్చయంతో ఉంది.