రాజస్థాన్ క్రికెట్ సంఘ అధ్యక్షుడిగా లలిత్ మోడీ
ఐపీఎల్ వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయినా.. రాజస్థాన్ క్రికెట్ సంఘం అద్యక్షుడిగా లలిత్ మోడీ ఎన్నికయ్యారు. గత సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను కోర్టు పరిశీలకుడు జైపూర్లో మంగళవారం ప్రకటించారు. సుప్రీంకోర్టు గత వారం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోర్టు పరిశీలకుడు సీల్డ్ కవర్లో ఉన్న ఓట్లను తెరిచారు. మొత్తం 33 ఓట్లు ఉండగా వాటిలో 26 ఓట్లు లలిత్ మోడీకే దక్కడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. అయితే.. ఆర్సీఏ అధ్యక్ష పదవి మోడీకి అంత సులభంగా ఏమీ దక్కేలా లేదు. న్యాయపరమైన అడ్డంకులతో పాటు.. బీసీసీఐ నిబంధనలు కూడా ఆయనకు అడ్డుపడేలాగే ఉన్నాయి.
బీసీసీఐతో పాటు ఆర్సీఏకు కూడా గతంలో అధ్యక్షుడిగా వ్యవహరించిన కిషోర్ రుంగ్తా ఇప్పుడు మోడీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టులో బీసీసీఐకి చుక్కెదురైనా, బోర్డు మాత్రం రాజస్థాన్ క్రీడా చట్టాన్ని సవాలు చేయాలని యోచిస్తోంది. అలా చేస్తే లలిత్ మోడీ రెండోసారి రాజస్థాన్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడు అయ్యే అవకాశం కోల్పోతారు. సస్పెండైన బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్తో మోడీకి ఏమాత్రం పడకపోవడంతో లలిత్ మోడీ ఇప్పుడు ఇంగ్లండ్లో ఉంటున్నారు. శ్రీనివాసన్ కూడా ప్రస్తుతం ఐపీఎల్ కుంభకోణంలో సుప్రీంకోర్టు విచారణ ఎదుర్కొంటున్నా, బీసీసీఐలో మాత్రం ఆయన బలం బాగానే ఉంది. దాంతో లలిత్ మోడీ తిరిగి భారత క్రికెట్ రాజకీయాల్లోకి రావడం అంత సులభంగా అయ్యేలా లేదు.