మోడియే గెలుస్తాడని తెలుసు
మోడియే గెలుస్తాడని తెలుసు
Published Tue, Jan 28 2014 2:15 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిందెవరో సుప్రీం కోర్టు ప్రకటించకముందే బీసీసీఐ చెప్పేసింది. బోర్డు నుంచి జీవితకాల బహిష్కరణ ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడియే విజేత అని స్పష్టం చేసింది. మొత్తం 33 ఓట్లలో 26 ఓట్లు మోడికే పడినట్టు చెప్పింది. అయితే అధికారికంగా ఈ ఫలితాలున్న సీల్డ్ కవర్‌ను తెరవకూడదని... అంతకన్నా ముందు తమ వాదనలు వినాలని కోర్టులో గట్టిగా వాదించింది. దీంతో తదుపరి విచారణ, ఫలితాల వెల్లడిని సుప్రీం కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది.
‘ఆర్‌సీఏ అధ్యక్షుడిగా గెలిచేదెవరో మాకు తెలుసు. 33 ఓట్లలో 26 ఓట్లు లలిత్ మోడికి మద్దతుగా ఉన్నాయి. కాబట్టి అతడే విజేత. అయితే అతడు జీవిత కాల బహిష్కరణ ఎదుర్కొంటున్నాడు. పోటీ చేసే అర్హతే తనకు లేదు. ఒకవేళ మోడి ఆర్‌సీఏ అధ్యక్షుడిగా నెగ్గితే మాకు ఆ సంఘాన్ని సస్పెండ్ చేయడం మినహా మరో దారి లేదు. ఒకవేళ అదే జరిగితే భారత జట్టులో ఉన్న రాజస్థాన్ ఆటగాళ్లు వెంటనే చోటు కోల్పోవాల్సి వస్తుంది’ అని బీసీసీఐ తెలిపింది.
ఇప్పటికే వాయిదా పడుకుంటూ వస్తున్న ఆర్‌సీఏ ఎన్నికల ఫలితాలను వాస్తవానికి సోమవారం ప్రకటించాల్సి ఉంది. అయితే బోర్డు దీన్ని సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. బీసీసీఐతో పాటు మోడికి వ్యతిరేకంగా పోటీలో నిలిచిన ఆర్‌పీ శర్మ ఈ ఎన్నికలపై కోర్టులో ఫిర్యాదు చేశారు. అంతకుముందు కోర్టులో ఇరువర్గాల న్యాయవాదుల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి.
ఒప్పుకున్నందుకు సంతోషం: మోడి
లండన్: ఆర్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో తన విజయం బీసీసీఐకి తెలిసినందుకు సంతోషంగా ఉందని లలిత్ మోడి అన్నారు. అయితే అధికారికంగా ఫలితాల వెల్లడి ఆలస్యం కావడంపై విచారం వ్యక్తం చేశారు.
Advertisement