
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): స్వర్ణ పతకంతో ఖాతా తెరిచిన భారత షూటర్లు తమ పోరాటాన్ని స్వర్ణంతోనే ముగించడం విశేషం. కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు సోమవారం భారత్‌కు పసిడి పతకంతోపాటు రజతం కూడా లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో సత్యేంద్ర సింగ్ బంగారు పతకం సొంతం చేసుకోగా... సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన చెయిన్ సింగ్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు.
మరోవైపు పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో బీరేన్‌దీప్ సోధి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌కు ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలు దక్కడం విశేషం. క్వాలిఫయింగ్‌లో 1162 పాయింట్లు స్కోరు చేసిన సత్యేంద్ర సింగ్ ఫైనల్లో 454.2 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. సంజీవ్ 453.3 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందాడు. డేన్ సామ్సన్ (ఆస్ట్రేలియా)కు కాంస్యం లభించింది.