‘పద్మభూషణ్’ గోపీచంద్
లియాండర్ పేస్ కూడా...
యువరాజ్ సహా ఏడుగురికి పద్మశ్రీ
న్యూఢిల్లీ: తన సుశిక్షణతో మేటి క్రీడాకారులను అందిస్తోన్న భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, తెలుగు తేజం పుల్లెల గోపీచంద్‌కు ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ పురస్కారం లభించింది. టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కూ దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మభూషణ్’ దక్కింది. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. ఈ జాబితాలో క్రీడారంగం నుంచి మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. ఇందులో ఏడుగురికి ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్, స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్‌తో పాటు మరో ఐదుగురికీ ఈ పద్మశ్రీ అవార్డు దక్కింది.
గతేడాది యూఎస్ ఓపెన్‌లో భాగస్వామి స్టెపానెక్‌తో కలిసి 40 ఏళ్ల లియాండర్ పేస్ కెరీర్‌లో 14వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ నెగ్గాడు. ఈ క్రమంలో పెద్ద వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. డేవిస్ కప్‌లో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన పేస్ వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. గతంలో పేస్‌కు ‘అర్జున అవార్డు’, ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’, ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి.
మరో కలికితురాయి...
క్రీడాకారుడిగా గొప్ప విజయాలు సాధించి... ఆ తర్వాత కోచ్‌గా మారిన 40 ఏళ్ల గోపీచంద్ కెరీర్‌లో ‘పద్మభూషణ్’ రూపంలో మరో కలికితురాయి చేరింది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామానికి చెందిన గోపీచంద్ క్రీడాకారుడిగా ఉన్నపుడు 1998 కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్‌లో సింగిల్స్ విభాగంలో కాంస్యం... 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించాడు.
మొత్తానికి గోపీచంద్ కెరీర్‌లో ఇది నాలుగో కేంద్ర పురస్కారం. 1999లో ‘అర్జున అవార్డు’, 2001లో ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’, 2005లో ‘పద్మశ్రీ’, 2009తో ‘ద్రోణాచార్య’ పురస్కారం గోపీచంద్‌కు లభించాయి. గచ్చిబౌలిలో అకాడమీని నిర్వహిస్తున్న గోపీచంద్ శిక్షణలోనే సైనా, సింధు సహా పలువురు క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు.