
హుందాగా వ్యవహరించండి : ఆమ్లా
అడిలైడ్:దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ హషీమ్ ఆమ్లాకు మరోసారి కోపం వచ్చింది. గత ఫిబ్రవరిలో ఓ మహిళా రిపోర్టర్ వేసుకున్న దుస్తులు ఇబ్బందికరంగా ఉండటం చేత ఇంటర్య్యూ ఇవ్వనంటూ స్పష్టం చేసిన ఆమ్లా.. తాజాగా ఆస్ట్రేలియా రిపోర్టర్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో భాగంగా అడిలైడ్ ఎయిర్పోర్ట్లో దూకుడుగా వ్యవహరించిన సదరు రిపోర్టర్ తీరును ఆమ్లా తప్పుబట్టాడు.
'మేము ఎయిర్ పోర్ట్లో బస్సు ఎక్కడానికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఒక రిపోర్టర్ ఆటగాళ్ల మధ్యకు వచ్చేశాడు. మమ్మల్ని గౌరవించడం అటుంచితే, మాతో చాలా అమర్యాదగా మాట్లాడాడు. మూడుసార్లు అతనికి చెప్పి చూశాం. మా విజ్ఞప్తిని ఎంతమాత్రం పట్టించుకోలేదు. సెక్యూరిటీ ప్రొటోకాల్ను ఉల్లంఘించి మాతో దూకుడుగా ప్రవర్తించాడు. కొద్దిగా విజ్ఞత పాటించండి. మాకు కొన్ని విలువలుంటాయి. మీరు హుందాగా ప్రవర్తించి మా పనిని చేసుకోనీయండి. ఇదొకసారి కాదు.. ఇప్పటికి మూడుసార్లు ఆ రిపోర్టర్ దూకుడుగా వ్యవహరించాడు. అతనికి కనీసం అధికారిక అక్రిడేషన్ కూడా లేదు. దాంతో సెక్యూరిటీ-రిపోర్టర్ మధ్య వివాదం చేసుకుంది. మీడియా ప్రొటోకాల్ ను మరచి ఇలా ప్రవర్తించడం ఎంతవరకూ సమంజసం' అని ట్విట్టర్లో ఆమ్లా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.