పాక్ ఆటగాళ్లు ఎందుకు రెచ్చిపోయారు?
కరాచీ: నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా లార్డ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించడం తమ క్రికెట్ జట్టుకు ఎంతో ప్రత్యేకమని కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. ఆరేళ్ల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పలువురు పాకిస్తాన్ ఆటగాళ్లు నిషేధం ఎదుర్కొన్న ఇదే వేదికలో విజయం సాధించడం జట్టులో తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నాడు. మూడున్నరేళ్ల తర్వాత ఆసియా ఉపఖండం వెలుపల పాక్ సాధించిన తొలి విజయం కావడం గమనార్హం.
పుష్ అప్స్ సీక్రెట్ చెప్పేశాడు!
'కాబుల్ ఆర్మీ క్యాంపు సిబ్బంది పర్యవేక్షణలో పాక్ ఆటగాళ్లు శిక్షణ పొందారు. కఠోరశ్రమతో కూడిన ఫీట్స్ చేశాం. ఆర్మీతో కలిసి పుష్ అప్స్ చేసేవాళ్లం. అందుకే వారికి ఈ విజయంలో భాగం ఉందని తెలిపేందుకు, ఆర్మీ వారికి ఈ విషయం గుర్తుకుతేవడానికి ఇంగ్లండ్ పై గెలిచిన అనంతరం లార్డ్స్ లో పాక్ ఆటగాళ్లు పుష్ అప్స్ తీశారు' అని మిస్బా వివరించాడు. సెంచరీ చేసిన అనంతరం మిస్బా కూడా పుష్ అప్స్ తీశాడు. ఆర్మీ వారు తమలో స్ఫూర్తిని నింపారని, మూడు టెస్టుల్లోనూ మంచి ఫలితాలు రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు. సర్ఫరాజ్ అహ్మద్, అసద్ షఫిఖ్ భాగస్వామ్యంతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించారని కొనియాడాడు.