
‘టి20 టీమ్‌లో ధోని లేకపోవడంపై అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సెలక్టర్లు ఇప్పటికే ధోనితో మాట్లాడారు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని వివరణ ఇవ్వాల్సింది కూడా ఏమీ లేదు. టి20 ఫార్మాట్‌లో రిషభ్ పంత్ లాంటి కుర్రాడు ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే మంచిదని ధోని భావించాడు. అందుకే స్వయంగా తప్పుకున్నాడు. అతను ఇప్పటికీ మా వన్డే జట్టులో కీలక భాగమని జట్టు కెప్టెన్‌గా నేను చెబుతున్నాను. సరైన దిశలో బంతులు వేసిన బౌలర్లదే ఈ సిరీస్ విజయం. నిజానికి మేం కూడా బౌలింగ్ చేయాలనే కోరుకున్నాం.
విండీస్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది. మున్ముందు ఇదే జోరు కొనసాగించాలని భావిస్తున్నాం. ఈ సిరీస్‌కు సంబంధించి రెండు ప్రధాన విషయాలు... మూడో పేసర్‌గా ఖలీల్ ఆకట్టుకోవడం, నాలుగో స్థానంలో రాయుడు బాధ్యత తీసుకోవడం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పాండ్యా తిరిగొస్తే బలం మరింత పెరుగుతుంది. అప్పుడు పాండ్యా, జడేజాలలో ఎవరనేది పరిస్థితిని బట్టి తేల్చుకుంటాం. భువీ, బుమ్రాలలో ఎవరికైనా అనుకోనిది ఏదైనా జరిగితే వికెట్లు తీసేందుకు జట్టులో మరొకరు సిద్ధంగా ఉన్నారు. మా ఫీల్డింగ్ మరికొంత మెరుగవ్వాలని కోరుకుంటున్నా. కెప్టెన్‌గా ఉంటూ భారీ పరుగులు సాధించడం నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఇది ప్రతీసారి జరగదు కానీ ఒక సారి జోరు మొదలైందంటే దానిని కొనసాగించాలని చూస్తాను. నేను అవార్డుల కోసం ఆడను. నా పరుగులు ప్రభావం చూపించి జట్టు గెలవడం ముఖ్యం’
– విరాట్ కోహ్లి, భారత కెప్టెన్