ఈడెన్‌లో సెంచరీతో చెలరేగిన ధోనీ
కోల్‌కతా: ఐపీఎల్ ఫ్రాంఛైజీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ కెప్టెన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీతో విజృంభించాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న గ్రూప్ డీ మ్యాచ్‌లో జార్ఖండ్‌కు సారథ్యం వహిస్తున్న ధోనీ (107 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 129) శతకం బాదాడు. లిస్ట్ ఏ మ్యాచ్‌లో ధోనీకిది 17వ సెంచరీ. జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ ఓ దశలో 57/6 స్కోరుతో కష్టాల్లోపడింది. ఈ సమయంలో ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. నదీమ్‌తో కలసి ఏడో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. నదీమ్ (53) హాఫ్ సెంచరీతో రాణించాడు. టెస్టులకు వీడ్కోలు పలికిన మహీ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఆడుతున్నాడు. నిన్న కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లోనూ ధోనీ (43) రాణించాడు. కాగా ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ 5 పరుగులతో ఓటమి చవిచూసింది.