సెమీస్‌లో జార్ఖండ్, బెంగాల్
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో జార్ఖండ్, బెంగాల్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ధోని సారథ్యంలోని జార్ఖండ్ జట్టు ఆరు వికెట్లతో విదర్భను ఓడించగా... బెంగాల్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో మహారాష్ట్రపై గెలిచింది. జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విదర్భ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 159 పరుగులే చేసింది.అనంతరం జార్ఖండ్ జట్టు 45.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.
జార్ఖండ్ స్కోరు 159 పరుగుల వద్ద కెప్టెన్ ధోని (18 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్స్) సిక్సర్‌ను బాది మ్యాచ్‌ను ముగించాడు. ధోని, ఇషాంక్ జగ్గీ (41 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్స్) ఐదో వికెట్‌కు అజేయంగా 49 పరుగులు జోడించారు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత మహారాష్ట్ర ఆరు వికెట్లకు 318 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగాల్ జట్టు 49.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసి గెలిచింది. శ్రీవత్స్ గోస్వామి (74; 7 ఫోర్లు), అనుస్థుప్ మజుందార్ (66; 7 ఫోర్లు, ఒక సిక్స్), సుదీప్ చటర్జీ (60 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేసి బెంగాల్ విజయంలో కీలకపాత్ర పోషించారు.