Ranji Trophy 2022-23 1st Quarter Final: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్‌దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది.
కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు.
ఇవాళే వివిధ వేదికలపై మరో మూడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది.
ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక 7 పరుగుల ఆధిక్యంలో ఉంది.
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు.. ఇండోర్ వేదికగా జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర-మధ్యప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో విజేతలు ఫిబ్రవరి 8-12 వరకు జరిగే రెండు సెమీఫైనల్‌లలో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్‌లో విజేతలు ఫిబ్రవరి 16-20 వరకే జరిగే అంతిమ సమరంలో ఎదురెదురుపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment