
గయనా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో గయానా అమెజాన్ వారియర్స్ మరో అద్భుత విజయాన్ని సాధించింది. పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న అమెజాన్ వారియర్స్.. గురువారం జమైకా తల్హాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అమెజాన్ వారియర్స్ కెప్టెన్ షోయబ్ మాలిక్(73 నాటౌట్; 45 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడగా, రూథర్‌ఫర్డ్(45; 43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడాడు. దాంతో అమెజాన్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన జమైకా జట్టు 16. 3 ఓవర్లలో79 పరుగులకే కుప్పకూలింది. జమైకా కెప్టెన్ క్రిస్ గేల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన ఆసీస్ బౌలర్ క్రిస్ గ్రీన్ బౌలింగ్‌లో గేల్ తాను ఆడిన తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. అటు తర్వాత జమైకా పతనం అలానే కొనసాగుతూ వచ్చింది. గ్లెన్ ఫిలిప్స్(21), లిటాన్ దాస్(21), ట్రెవెన్ గ్రిఫిత్(11)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 15 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోవడంతో జమైకా ఘోర ఓటమి పాలైంది. వారియర్స్ బౌలర్లలో తాహీర్ మూడు వికెట్లు సాధించగా, క్వియాస్ అహ్మద్, కీమో పాల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.క్రిస్ గ్రీన్, హెమ్రాజ్, షోయబ్ మాలిక్‌లు వికెట చొప్పున తీశారు.