ఫైనల్లో మేరీకోమ్
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో భారత బాక్సర్లకు మంగళవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సెమీస్ బౌట్స్‌లో సరితా దేవి, పూజా రాణి పరాజయం పాలై రెండు కాంస్యాలు అందించగా... అంచనాలకు తగ్గట్టుగానే దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మేరీకోమ్‌కు కనీసం రజతం ఖాయం. ఇక పురుషుల విభాగంలో సతీష్ కుమార్, వికాస్ క్రిషన్ సెమీస్‌లో ప్రవేశించారు.
మహిళల ఫ్లయ్ వెయిట్ 48-51కేజీ విభాగం సెమీఫైనల్లో మేరీకోమ్ 3-0తో పూర్తి ఆధిపత్యంతో వియత్నాంకు చెందిన తి బాంగ్ లిని ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. మిడిల్ వెయిట్ 69-75కేజీల విభాగం సెమీస్‌లో పూజా రాణి 0-3తో లి కియాన్ (చైనా) చేతిలో ఓడింది.
పురుషుల మిడిల్ వెయిట్ 75కేజీల క్వార్టర్స్‌లో వికాస్ క్రిషన్ 3-0తో హుర్షిడ్‌బెక్ (ఉజ్బెకిస్థాన్) పై నెగ్గాడు. సూపర్ హెవీ 91+కేజీల విభాగం క్వార్టర్స్‌లో సతీష్ కుమార్ 2-1తో హుస్సేన్ (జోర్డాన్)ను ఓడించాడు. బాంటమ్ 56కేజీల క్వార్టర్స్‌లో శివ థాపా, లైట్ ఫ్లయ్ (46-49కేజీల) క్వార్టర్‌ఫైనల్లో దేవేంద్రో సింగ్ ఓడిపోయారు.