కొట్టాయం: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ వీరాభిమాని డీనూ అలెక్స్(30) మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలో అర్జెంటీనా దారుణంగా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్జెంటీనా ఓటమి తర్వాత ‘ఇక లోకాన్ని విడిచి వెళుతున్నా’ అని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం కొట్టాయంకు సమీపంలో ఉన్న మీనాచి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం అతని మృతదేహాన్ని నదిలో గుర్తించారు.
‘మ్యాచ్ జరిగిన రోజు రాత్రి గం. 11.30ని.లకు వరకూ అలెక్స్ టీవీ ముందు కూర్చొని ఉన్నాడు. అయితే మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోవడం అవమానంగా భావించి ఉంటాడు. స‍్నేహితులకు ముఖం చూపించలేక ప‍్రాణం తీసుకుని ఉంటాడు’ అని తండ్రి పీవీ అలెగ్జాండర్ కన్నీటి పర్యంతమయ్యాడు.
ఫిఫా ప్రపంచకప్‌లో లియోనల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా.. క్రొయేషియా చేతిలో 0-3 తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిని జీర్ణించుకోలేని అలెక్స్ ఒక సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ‘ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నా.. ఇంకా నేను చూడటానికి ఏం లేదు’ అని లేఖలో పేర్కొన్నాడు. ఈ మేరకు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, చివరకు మృతదేహంగా లభించడం స్థానికంగా విషాదం మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment