
క్లార్క్, కుక్ ‘శతకాలు’
పెర్త్: యాషెస్ సిరీస్ మూడో టెస్టులో అరుదైన రికార్డు నమోదు కానుంది. ‘వాకా’ మైదానంలో శుక్రవారంనుంచి జరిగే ఈ టెస్టుతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కెప్టెన్లు వ్యక్తిగత ఘనతను అందుకోనున్నారు. మైకేల్ క్లార్క్, అలిస్టర్ కుక్‌లకు తమ కెరీర్‌లో ఇది వందో టెస్టు కావడం విశేషం.
ఒకే మ్యాచ్‌తో ఇరు జట్ల కెప్టెన్లు 100 టెస్టుల మైలురాయిని అందుకోవడం టెస్టు చరిత్రలో ఇదే మొదటి సారి. 2004లో (భారత్‌పై) తొలి టెస్టు ఆడిన క్లార్క్ 52.58 సగటుతో 99 టెస్టుల్లో 7940 పరుగులు చేశాడు.
2006లో (భారత్‌పై) మొదటి టెస్టు ఆడిన కుక్, 47.20 సగటుతో 99 టెస్టుల్లో 7883 పరుగులు సాధించాడు. తొలి టెస్టు ఆడిన నాటినుంచి వేగంగా 100 టెస్టుల మైలురాయిని అందుకున్న (7 సంవత్సరాల 9 నెలలు) ఆటగాడిగా కూడా కుక్ రికార్డు సృష్టించనున్నాడు. గతంలో ఒకేసారి 2000లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆథర్టన్, స్టివార్ట్ ఒకే టెస్టులో 100వ టెస్టు మైలురాయిని చేరారు.
2006లో ఒకే టెస్టులో ముగ్గురు ఆటగాళ్లు (కలిస్, పొలాక్, స్టీఫెన్ ఫ్లెమింగ్) ఈ ఘనత సాధించడం విశేషం.