
సత్తా చాటిన రాష్ట్ర ఆర్చర్లు
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: మినీ జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్ (అండర్-14)లో రాష్ట్ర ఆర్చర్లు సత్తా చూపుతున్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం చెరుకూరి లెనిన్-ఓల్గా స్మారక 6వ మినీ జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. తొలి రోజు కాంపౌండ్, ఇండియన్ రౌండ్ బౌ విభాగాల్లో ఈవెంట్లు నిర్వహించారు.
కాంపౌండ్ క్వాలిఫయింగ్ రౌండ్ బాలికల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కె.జ్యోత్స్న 720 పాయింట్లకు 641 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. కె.అక్షయ 7వ స్థానంలో, ఎస్‌డీ రిఫాత్ 10వ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో కె.మహేష్ (632 పాయింట్లు)కు మొదటి స్థానం దక్కింది. ఎం.చరిత్ ఐదవ స్థానంలో, కె.వెంకటాద్రి 8వ స్థానంలో, డి.రోహిత్ మణివర్మ 12వ స్థానంలో నిలిచారు.