కాలిఫోర్నియా: వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిష్‌లో భారత్‌కు చెందిన మీరాబాయ్ చాను స్వర్ణ పతకం సాధించారు. 48 కేజీల విభాగంలో పాల్గొన్న చాను మొత్తం 194 కేజీలు ఎత్తి పసిడి పతకాన్ని దక్కించుకున్నారు. స్నాచ్ లో 85 కేజీల ఎత్తిన మీరాబాయ్.. క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు ఎత్తి సరికొత్త రికార్డుతో పసిడిని కైవసం చేసుకున్నారు. ఫలితంగా 22 ఏళ్ల తరువాత ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన రెండో భారత క్రీడాకారిణిగా చాను గుర్తింపు సాధించింది.
1995లో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో కరణం మల్లీశ్వరి తొలిసారి స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంత కాలానికి చాను మళ్లీ పసిడిని ఒడిసి పట్టుకుని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఈ సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన చాను వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment