48 కేజీల బంగారం | Mirabai Chanu wins gold at World Weightlifting Championships | Sakshi
Sakshi News home page

48 కేజీల బంగారం

Published Fri, Dec 1 2017 12:53 AM | Last Updated on Fri, Dec 1 2017 3:50 AM

Mirabai Chanu wins gold at World Weightlifting Championships - Sakshi

సరిగ్గా 22 ఏళ్ల క్రితం తెలుగు తేజం కరణం మల్లేశ్వరి ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది. రెండు దశాబ్దాలు దాటినా ఆ స్థాయి ప్రదర్శన ఇంకెవరూ కనబర్చలేకపోయారు. తాజాగా మీరాబాయి చాను ఆ లోటు తీర్చింది. అమెరికాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో రెండు బంగారు పతకాలు సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచ స్ధాయిలో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది.  

న్యూఢిల్లీ: భారత మహిళా వెయిట్‌లిఫ్టర్‌ సయిఖోమ్‌ మీరాబాయి చాను జాతి గర్వించే విజయాన్ని సాధించింది. అమెరికాలోని అనహెమ్‌లో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలతో చరిత్ర సృష్టించింది. 48 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన ఈ మణిపూర్‌ లిఫ్టర్‌ మొత్తం 194 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో ఆమె స్నాచ్‌లో 85 కేజీల బరువెత్తింది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 109 కేజీలతో మరో స్వర్ణం గెలిచింది. ఈ క్రమంలో మీరా కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత అయిన  మల్లేశ్వరి 1994, 1995 ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ల్లో వరుసగా స్వర్ణ పతకాలు గెలిచింది. మళ్లీ 22 ఏళ్ల తర్వాత మీరాబాయి భారత వెయిట్‌లిఫ్టింగ్‌ను పసిడి పతకంతో మురిపించింది. ఈ ఈవెంట్‌లో 193 కేజీల బరువెత్తిన సుక్చరొన్‌ తున్యా (థాయ్‌లాండ్‌) రజతం గెలుపొందగా, సెగురా అనా (182 కేజీలు; ఐర్లాండ్‌) కాంస్య పతకం దక్కించుకుంది. డోపింగ్‌ మరకలతో రష్యా, చైనా, కజకిస్తాన్, ఉక్రెయిన్, అజర్‌బైజాన్‌లకు చెందిన మేటి లిఫ్టర్లు ఇందులో పాల్గొనే అవకాశం కోల్పోయారు.

డీఎన్‌ఎఫ్‌ నుంచి స్వర్ణం దాకా...
గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌ (2014)లో రజతం నెగ్గిన 23 ఏళ్ల మీరాబాయి చాను... ఇక ఒలింపిక్స్‌ పతకమే లక్ష్యంగా సాధన చేసింది. మొత్తానికి గతేడాది రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించి.. కోటి ఆశలతో బరిలోకి దిగింది. కానీ పోటీ ముగిశాక చూస్తే...ఆమె పేరుపక్కన బ్రాకెట్లలో కేజీలు ఉండాల్సిన చోట డీఎన్‌ఎఫ్‌ (డిడ్‌ నాట్‌ ఫినిష్‌–పోటీ పూర్తి చేయలేదు) అనే ముద్రపడింది. రియోలో 12 మంది బరిలోకి దిగగా ఆమె తన మూడు ప్రయత్నాల్లో ఒక్కసారైన బరువెత్తలేక చతికిలబడింది.  2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11వ స్థానంలో నిలిచిన చాను... ఆ మరుసటి ఏడాది జరిగిన మెగాఈవెంట్‌లో తొమ్మిదో స్థానంతో టాప్‌–10లో నిలిచింది. రెండేళ్లు తిరిగేసరికి ఇప్పుడు రెండు బంగారు పతకాలను చేజిక్కించుకుంది.

ప్రశంసల వర్షం
ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో చాంపియన్‌గా నిలిచిన మణిపూర్‌ లిఫ్టర్‌ మీరాబాయిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

‘స్వర్ణం గెలిచిన మీరాబాయికి అభినందనలు. యావత్‌ భారతం మీ ప్రదర్శన చూసి గర్వపడు తోంది. మరో చాంపియన్‌ను అందించిన మణిపూర్‌ రాష్ట్రానికి శుభాకాంక్షలు’
– రామ్‌నాథ్‌ కోవింద్, రాష్ట్రపతి

‘చాను... నిన్ను చూసి జాతి గర్విస్తోంది. మీ స్వర్ణసాకారానికి అభినందనలు. భవిష్యత్తులో మరెన్నో పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’
– నరేంద్ర మోదీ, ప్రధాని  

కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్, మహిళా చాంపియన్‌ బాక్సర్‌ మేరీకోమ్, ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్, భారత వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) కార్యదర్శి సహదేవ్‌ యాదవ్‌ తదితరులు మీరా ఘనతను కొనియాడారు.

నా కోచే లేకుంటే ఈ ప్రదర్శనే లేదు. స్వర్ణం లేదు. కోచ్‌ విజయ్‌ శర్మ నన్ను అనుక్షణం ముందుండి నడిపించారు. వెన్నంటి ప్రోత్సహించారు. రియోలో తీవ్ర నిరాశకు గురయ్యా. ఏడాదికాలంగా వేధిస్తున్న చేదు అనుభవం ఈ స్వర్ణంతో కనుమరుగైంది. ఇక్కడితో ఆగిపోను. నా బలహీనతలను అధిగమించేందుకే అధిక ప్రాధాన్యమిస్తా. వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించేందుకు కృషి చేస్తా.     – మీరాబాయి చాను 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement