కెప్టెన్సీని వీడనని.. రిటైరయ్యాడు
లాహోర్: పాకిస్థాన్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. వెస్టిండీస్‌తో జరిగే సిరీసే తనకు చివరిదని చెప్పాడు. గురువారం లాహోర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హక్ ఈ విషయాన్ని ప్రకటించాడు. కాగా దేశవాళీ క్రికెట్‌లో కొనసాగనున్నట్టు స్పష్టం చేశాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, క్రికెట్‌తో తన అనుబంధాన్నికొనసాగిస్తానని చెప్పాడు. 42 ఏళ్ల హక్ పాక్ తరపున 72 టెస్టులు, 162 వన్డేలు, 39 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు.
ఇటీవల పాక్ టెస్టు కెప్టెన్సీ నుంచి మిస్బాను తప్పుకోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరగా, దానికి ఈ వెటరన్ క్రికెటర్ ఒప్పుకోలేదు. తాను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకోవాలంటూ పీసీబీని ప్రశ్నించాడు. పాక్ తరఫున మరికొన్ని రోజులు ఆడాల్సిందిగా తన భార్య, పిల్లలు కోరుకుంటున్నట్టు చెప్పాడు. కాగా పాక్ ఇటీవల టెస్టు ఫార్మాట్‌లో ఓటమి చవిచూడటంతో ఒత్తిడికి గురయ్యాడు. బుధవారం పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ హక్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని చెప్పాడు. రిటైర్మెంట్ గురించి హక్‌తో చర్చించలేదని తెలిపాడు. ఇంతలోనే అతను రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.