
ఇలా అయితే ఎలా?: మిస్బావుల్ ధ్వజం
తమతో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడటానికి సుముఖంగా లేమంటూ స్పష్టం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పై పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ ధ్వజమెత్తాడు.
కరాచీ:తమతో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడటానికి సుముఖంగా లేమంటూ స్పష్టం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పై పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ ధ్వజమెత్తాడు. అసలు ఇండో -పాక్ క్రికెట్ సంబంధాలపై ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలియకుండా ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని విమర్శించాడు. ఇరు దేశాల మధ్య క్రికెట్ జరగాలని ప్రజలు కోరుకున్నప్పుడు, ఈ క్రీడలో రాజకీయ పరమైన అంశాలను ముడిపెట్టకూడదన్నాడు. 'నేను ఎప్పుడూ భారత్తో సిరీస్తో ఆడటానికి ఇష్టపడుతుంటాను. ప్రత్యేకంగా భారత్ ఆడుతున్నప్పుడు పాక్ కెప్టెన్గా ఉండాలని అనుకుంటా. క్రికెట్ అనే క్రీడలో రాజకీయ జోక్యం లేనప్పుడే మాత్రమే ఇరు దేశాల క్రికెట్ సిరీస్ జరుగుతుంది' అని మిస్బా విమర్శనాస్త్రాలు సంధించాడు.
అంతకుముందు పలువురు పాక్ మాజీ క్రికెటర్లు అనురాగ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సంగతి తెలిసిందే. . అనురాగ్ ఒక క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారా?లేక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా? అంటూ పాక్ దిగ్గజ ఆటగాడు మొహ్మద్ యూసఫ్ విమర్శించాడు. అనురాగ్ తాజా ప్రకటన కచ్చితమైన రాజకీయ వ్యాఖ్యగా ఉందంటూ విమర్శించాడు. ఒక స్పోర్టింగ్ బాడీలో భాగమైన బీసీసీఐ ..రాజకీయ పరమైన ఆధిపత్యం చెలాయిస్తుందనడానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ అని మరో మాజీ అబ్దుల్ ఖాదిర్ విమర్శించారు. చాలాకాలం నుంచి తమతో క్రికెట్ ఆడటానికి భారత్ మొగ్గు చూపకపోయినప్పటికీ, అనురాగ్ చేసిన ప్రస్తుత వ్యాఖ్యలతో వచ్చే లాభం ఏముందని ప్రశ్నించాడు.