మిస్సీ ‘సిక్సర్’
ఈత కొలనులో మరో బంగారు చేప అవతరించింది. అమెరికా టీనేజ్ సెన్సేషన్ మిస్సీ ఫ్రాంక్లిన్ ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో కొత్త చరిత్ర లిఖించింది. ఒకే చాంపియన్‌షిప్‌లో అత్యధిక స్వర్ణాలు గెలిచిన మహిళా స్విమ్మర్‌గా గుర్తింపు పొందింది. ‘మిసైల్ మిస్సీ’గా పేరొందిన 18 ఏళ్ల ఈ అమెరికా స్విమ్మర్ ఆదివారం జరిగిన 4ఁ100 మీటర్ల మెడ్లే రిలేలో స్వర్ణం నెగ్గి తన పసిడి పతకాల సంఖ్యను ఆరుకు పెంచుకుంది. అంతకుముందు మిస్సీ 100, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 4ఁ100, 4ఁ200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఒకేసారి ఆరు స్వర్ణాలు సాధించిన తొలి మహిళా స్విమ్మర్‌గా రికార్డు పుటల్లో చోటు సంపాదించింది.
మిస్సీ మెరుపులతో గతంలో ఐదు స్వర్ణాలతో ట్రేసీ కాల్కిన్స్ (అమెరికా-1978), లిబ్బీ ట్రికెట్ (ఆస్ట్రేలియా-2007) పేరిట ఉన్న ఈ రికార్డు తెరమరుగైంది. తాజా ఘనతతో ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లోగానీ, ఒకే ఒలింపిక్స్‌లోగానీ అత్యధికంగా ఆరు స్వర్ణాలు నెగ్గిన మైకేల్ ఫెల్ప్స్ (అమెరికా), మార్క్ స్పిట్జ్ (అమెరికా), ఇయాన్ థోర్ప్ (ఆస్ట్రేలియా), క్రిస్టిన్ ఒట్టో (తూర్పు జర్మనీ) సరసన కూడా మిస్సీ చేరింది. గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు నెగ్గిన మిస్సీ ‘మ్యాజిక్’ కారణంగా... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అమెరికా 29 పతకాలతో (13 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్యాలు) అగ్రస్థానాన్ని దక్కించుకుంది. చైనా తొమ్మిది పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో మొత్తం ఐదు ప్రపంచ రికార్డులు నమోదుకాగా ఆ ఐదూ మహిళా స్విమ్మర్లే నెలకొల్పడం విశేషం.