మార్ష్ స్థానంలో బర్న్స్
‘బాక్సింగ్ డే’ టెస్టుకు ఆసీస్ జట్టు
బ్రిస్బేన్: ఊహించని విధంగా క్వీన్స్‌లాండ్ బ్యాట్స్‌మన్ జో బర్న్స్‌కు ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. భారత్‌తో జరగబోయే మూడో టెస్టు (బాక్సింగ్ డే) కోసం ఎంపిక చేసిన 13 మందిలో అతనికి స్థానం కల్పించారు. గాయపడిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో జో బర్న్స్‌ను తీసుకున్నారు.
ఈ ఏడాది షీఫీల్డ్ షీల్డ్ టోర్నీలో బర్న్స్ 55 సగటుతో 439 పరుగులు చేయడం అతనికి కలిసొచ్చింది. ఈ క్వీన్స్‌లాండర్ ఫస్ట్‌క్లాస్ స్థాయిలో 42.54 సగటుతో 2978 పరుగులు సాధించాడు. క్రిస్‌మస్ పండుగ వేళ తనకు ఊహించని అవకాశం దక్కిందని బర్న్స్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు వివరాలు: స్మిత్ (కెప్టెన్), వార్నర్, రోజర్స్, వాట్సన్, షాన్ మార్ష్, జో బర్న్స్, హాడిన్, జాన్సన్, స్టార్క్, లయోన్, హాజల్‌వుడ్, హారిస్, సిడిల్.