సిడ్నీ:ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే మ్యాచ్ లో రెండు హ్యాట్రిక్ లు సాధించి దాదాపు 30 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్ లో భాగంగా షెఫల్డ్ షీల్డ్ మ్యాచ్ లో స్టార్క్ రెండు హ్యాట్రిక్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూసౌత్ వేల్స్ ఆటగాడైన స్టార్క్ .. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. తద్వారా ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 1978 తరువాత రెండు ఇన్నింగ్స్ లోనూ హ్యాట్రిక్ లు సాధించిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. కాగా, షెఫల్డ్ ఫీల్డ్ మ్యాచ్ లో ఈ ఫీట్ ను 27 ఏళ్ల తరువాత సాధించిన తొలి బౌలర్ గా స్టార్క్ మరో రికార్డు సాధించాడు. అయితే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు.
ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లో స్టార్క్ హ్యాట్రిక్ సాధించే క్రమంలో బెహ్రెన్ డార్ఫ్, మూడీలను అవుట్ చేయడం ఇక్కడ మరో విశేషం. స్టార్క్ విశేషంగా రాణించడంతో న్యూసౌత్ వేల్స్ జట్టు 171 పరుగుల తేడాతో వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.స్వదేశంలో నవంబర్ 23 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో స్టార్క్ సత్తాచాటుకోవడం ఆ జట్టులో ఆనందం వ్యక్తమవుతోంది.
గతంలో స్వదేశంలో జరిగిన యాషెస్ సిరీస్ లో స్టార్క్ అద్భుతమైన గణాంకాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2013 యాషెస్ లో మూడు మ్యాచ్ ల్లో 32.75 యావరేజ్ తో11 వికెట్లను సాధించిన స్టార్క్.. 2015 యాషెస్ లో ఐదు మ్యాచ్ ల్లో 30.50 సగటుతో 18 వికెట్లను తీశాడు. 2013 యాషెస్ లో అతని బెస్ట్ 3/72 కాగా, 2015 యాషెస్ లో అతని అత్యుత్తమ ప్రదర్శన 6/111.
Comments
Please login to add a commentAdd a comment