
సిడ్నీ:గత నెల్లో లండన్ లోని బ్రిస్టల్ హోటల్లో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అరెస్టయిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే అతను ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్నాడు. స్టోక్స్ పై విచారణ పూర్తయ్యే వరకూ అతనిపై వేటు కొనసాగుతుందని బోర్డు ఇప్పటికే స్సష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్ కు స్టోక్స్ ను పక్కన పెట్టేశారు. కాగా, ఇంగ్లిష్ ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాలో 2017-18 సంవత్సరానికి గాను స్టోక్స్ కు స్థానం దక్కడం ఒక్కటే అతనికి ఊరటనిచ్చే అంశం.
ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్ కు ప్రధాన ఆటగాడైన స్టోక్స్ దూరమైతే పైచేయి సాధించడం ఆసీస్ కు కాస్త సులభతరం అవుతుందనేది కాదనలేని సత్యం. ఈ విషయాన్ని ఇప్పటికే ఆసీస్ మాజీ క్రికెటర్లు ఇయాన్ చాపెల్ లాంటి వారు సైతం అంగీకరించారు. స్టోక్స్ లేకపోతే యాషెస్ సిరీస్ ను తీసుకెళ్లడం ఇంగ్లండ్ వల్ల కాదంటూ చాపెల్ సెటైర్లు గుప్పించాడు. కాగా, తాజాగా స్టోక్స్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్. పనిలో పనిగా స్టోక్స్ ను వేధించమంటూ ఆసీస్ అభిమానులకు సలహా కూడా ఇచ్చేశాడు.
'యాషెస్ సిరీస్ కు స్టోక్స్ దూరంగా ఉంటాడనే అనుకుంటున్నా. ఒకవేళ ఆసీస్ పర్యటనకు స్టోక్స్ చివరి నిమిషంలో వస్తే అతన్ని ఆసీస్ అభిమానులు అదే పనిగా వేధించండి. గట్టిగా అరుస్తూ స్టోక్స్ కు విసుగు తెప్పించండి. అతను ఆడితే స్టేడియం నుంచే వచ్చే అరుపుల్ని వినాలని ఆసక్తిగా ఉంది. ఒకవేళ స్టోక్స్ యాషెస్ లో పాల్గొంటే అక్కడ అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రతికూల వాతావరణం ఎలా ఉంటుందో అతనికి తెలుసు. ఏది ఏమైనా యాషెస్ సిరీస్ సాఫీగానే సాగుతుందని అనుకుంటున్నా'అని స్టోక్స్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment