అంపైర్ అండతోనే వికెట్లు తీశా:అలీ
మాంచెస్టర్: కొంతమంది ఒకే ఒక్క ఓవర్ నైట్ లో స్టార్ లుగా మారిపోతారు. ఏనుగంత అవకాశం ఉన్నా.. ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. అవకాశాలకు అదృష్టం తోడైతే ఇంకేముంది ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు. ఇదే కోవలోకి వస్తాడు ఇంగ్లండ్ టెస్ట్ క్రికెటర్ మొయిన్ అలీ. వరుసగా రెండు టెస్టుల్లో ఇరగదీసి భారత్ ను కంగుతినిపించిన ఈ పార్ట్ టైమ్ స్పిన్నర్.. ఇంగ్లండ్ కు వరంలా మారాడు. కాగా తన ఈ విజయం వెనుక అంపైర్ కుమార ధర్మసేన పాత్ర ఉందని అలీ స్పష్టం చేశాడు. 'లార్డ్స్ టెస్టుల్లో ఎక్కువగా పరుగులిచ్చేశాను. ఆ సమయంలో బెల్ నాతో బౌలింగ్ లో వేగం పెంచమన్నాడు.
అయితే నాకు వేగంగా బంతుల్ని ఎలా సంధించాలో తెలియలేదు. అనంతరం ఇదే విషయంపై కుమార్ ధర్మసేనను అడిగితే చిన్న చిట్కా చెప్పాడని' అలీ తెలిపాడు. ఆ చిట్కానే అనుసరించే మూడు, నాలుగు టెస్టుల్లో విజయం సాధించానన్నాడు. లార్డ్స్ టెస్టు అనంతరం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మాజీ ఆఫ్ స్పిన్నర్, అంపైర్ కుమార ధర్మసేనను సలహా తీసుకోవటమే తనకు ఉపకరించిందన్నాడు. బౌలింగ్ ను ఫ్లాట్ గా కాకుండా.. తిన్నగా వేగంగా బౌల్ చేయమన్న ఆ ఒక్క సలహాతోనే వికెట్లు తీశానని అలీ తెలిపాడు.