
'అది రవిశాస్త్రికే అవమానం'
న్యూఢిల్లీ: 'భారత క్రికెట్‌లో గొప్ప పేరున్న అనేక మంది క్రికెటర్లకు కూడా సాధ్యం కాని ఘనతను ప్రస్తుత జట్టు సాధించింది. ఉదాహరణకు శ్రీలంక గడ్డపై 20 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ గెలవడం అలాంటిదే. ఎంతో మంది క్రికెటర్లు 20 ఏళ్ల పాటు భారత్‌కు ఆడారు. అనేక సార్లు లంకలో పర్యటించారు కానీ సిరీస్ గెలవలేకపోయారు. గత జట్లకు సాధ్యం కాని విధంగా ఈ కుర్రాళ్లు వన్డే సిరీస్ కూడా గెలిచారు’ అని ఇటీవల భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తనకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రస్తుత భారత క్రికెట్ జట్టును రవిశాస్త్రి ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. అదే సమయంలో గత భారత క్రికెట్ జట్టుకు సాధ్యం కానిది అంటూ మాజీలకు కోపం వచ్చే తరహాలో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే రవిశాస్త్రి వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ గంగూలీ వ్యంగ్యస్త్రాలు సంధించగా, తాజాగా మరో మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అసలు రవిశాస్త్రి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదంటూ అజహర్ మండిపడ్డాడు. ప్రధానంగా విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుకే మొత్తం క్రెడిట్ ఇవ్వడాన్ని అజహర్ ఇక్కడ తప్పుబట్టాడు. 'శ్రీలంక సిరీస్ తోనే విదేశాల్లో ప్రస్తుత భారత జట్టు ప్రదర్శనపై అంచనాకు రావొద్దు. అక్కడ శ్రీలంక బలహీనంగా ఉంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి కఠినమైన విదేశీ పర్యటనల తరువాత మాత్రమే విరాట్ గ్యాంగ్ పై అంచనా రావాలి. భారత్ కు కఠినమైన విదేశీ టూర్ ముందుంది. మన విదేశాల్లో ప్రదర్శన చూడటానికి అది నాకు ఒక అవకాశం. నేను ఎప్పుడూ సానుకూల ధోరణితో ఉంటా. ప్రస్తుత జట్టు అద్భుతాలు చేస్తుందని చెబితే, అంతకుముందు ఎటువంటి అద్భుతాలు చేయలేదనా?, భారత క్రికెట్ లో చాలా వాస్తవాల్ని రవిశాస్త్రి మరచిపోయినట్లు ఉన్నాడు. గతంలో నీవు భారత్ కు ఆడిన సంగతి గుర్తు లేదా?, నిన్ను నీవు అగౌరవపరచుకుంటావా?, గత జట్టులో నీకు భాగం లేదా?', అలా చెప్పడం నీకే అవమానం' అని అజహర్ ధ్వజమెత్తాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ట్రాక్ లపై భారత్ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో చూద్దాం అని పేర్కొన్న అజహర్.. ప్రస్తుత శ్రీలంక జట్టు చాలా బలహీనమైన జట్టు అనే వాస్తవాన్నిరవిశాస్త్రి అంగీకరించాలంటూ హితబోధ చేశాడు.