
హెచ్‌సీఏపై అజహర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పై భారత మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్సీఏ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని, వాటిని వెంటనే రద్దు చేయాలంటూ ధ్వజమెత్తారు. అసలు హెచ్సీఏ తీరు సరిగా లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే హెచ్‌సీఏ సెలక‌్షన్ కమిటీకి ఎటువంటి అర్హత లేదని విమర్శించారు. ఆ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
భారతీయ క్రికెటర్లకు హెచ్‌సీఏలో గుర్తింపు లేదన్న అజహర్.. హైదరాబాద్ క్రికెట్ జట్టు నుంచి కొందరు క్రీడాకారులు రంజీకి ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించిందన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అన్యాయం జరిగింది.. ఈఎంపిక లోథా కమిటీ సిఫారసుల మేరకే జరిగిందా లేదా అర్ధం కావటం లేదన్నారు. ఎన్నికల తరువాత హెచ్‌సీఏలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇది ఎవరినీ నిందించటానికి కాదన్నారు.హెచ్‌సీఏ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ఇంకా సమయం ఉంది...అప్పటి వరకు వేచి చూడాలన్నారు. తీర్పు వచ్చాక ఏం చెయ్యాలో చెప్తానన్నారు.