నిన్న షమీ భార్య.. నేడు మహ్మద్ కైఫ్
భారత క్రికెటర్ మహమ్మద్ షమీ ఇటీవల తన భార్య, కూతురితో కలిసి దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా.. షమీ భార్య హసిన్ జహాన్ స్లీవ్‌లెస్ గౌను వేసుకుని ఫొటోలో కనిపించడంపై కొందరు మతకోణంలో దానిని వ్యతిరేకించారు. దీనిపై షమీ ఘాటుగా స్పందించగా, మరో క్రికెటర్ మహ్మద్ కైఫ్ అతనికి అండగా నిలిచాడు. తాజాగా మహ్మద్ కైఫ్ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు. కైఫ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫొటోపై వివాదం ఏర్పడింది.
ఈ ఫొటోలో కైఫ్ సూర్యనమస్కారాలు చేస్తున్నట్టుగా ఉంది. దీనిని కొందరు మతకోణంలో విమర్శించారు. సూర్య నమస్కారాలు చేయడం ఇస్లాం సంప్రదాయాలకు, సంస్కృతికి వ్యతిరేకమని, వివాదాస్పదమైన ఫొటోను ఎందుకు పోస్ట్ చేశావని ఓ నెటిజన్ కైఫ్‌ను విమర్శించాడు. ఇస్లాంలో సూర్యనమస్కారం వందశాతం నిషేధం అంటూ మరో నెటిజెన్ తప్పుపట్టాడు. దీనికి కైఫ్ ఘాటుగా సమాధానాలిచ్చాడు. సూర్య నమస్కారం అన్నది పూర్తిగా భౌతిక వ్యవస్థ పనితీరుకు సంబంధించినదని, ఏ పరికరం లేకుండా ఎక్సర్‌సైజ్ చేసే పద్ధతని, తన హృదయంలో అల్లా ఉన్నాడని, సూర్యనమస్కారం చేసినా, జిమ్‌లో కసరత్తులు చేసినా అందరికీ ఉపయోగమని.. కైఫ్ రీ ట్వీట్ చేశాడు. ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడం కోసం కైఫ్ ఈ ఫొటోలను పోస్ట్ చేయడాన్ని చాలామంది ప్రశంసించారు.