
బంగ్లాదేశ్ 154/3
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తమీమ్ ఇక్బాల్ (50 బంతుల్లో 56; 11 ఫోర్లు), మోమినుల్ హక్ (110 బంతుల్లో 64 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో పూర్తి ఓవర్ల ఆట సాధ్యం కాలేదు. దీంతో తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి బంగ్లా 40.2 ఓవర్లలో మూడు వికెట్లకు 154 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హక్‌తో పాటు షకీబ్ (5 బ్యాటింగ్) ఉన్నాడు.
తొలి సెషన్ ఆరంభంలోనే వర్షం ఆటంకం కలిగించడంతో ముందుగానే లంచ్ విరామానికి వెళ్లారు. లంచ్ అనంతరం 48 బంతుల్లోనే తమీమ్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ముఖ్యంగా బౌల్ట్ బౌలింగ్‌లో బౌండరీల వరద పారించాడు. అయితే ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో తనే ఎల్బీగా అవుట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. రెండో వికెట్‌కు తమీమ్, మోమినుల్‌తో కలిసి 44 పరుగులు జోడించాడు. ఆ తర్వాత కూడా మరో గంటన్నరపాటు వర్షం కురవడంతో తొలి రెండు సెషన్లలో కేవలం 29 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చివరికి వెలుతురు లేమితో అంపైర్లు ఆటను ముందుగానే ముగించారు.