
మా వాళ్లు కూడా రేసులో ఉంటారు: మోర్గాన్
గత కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలానికి ఇంగ్లండ్ నుంచి పెద్ద సంఖ్యలో క్రికెటర్లు అందుబాటులో ఉండటం లేదు.
కోల్కతా: గత కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలానికి ఇంగ్లండ్ నుంచి పెద్ద సంఖ్యలో క్రికెటర్లు అందుబాటులో ఉండటం లేదు. ఇంగ్లండ్ ఆటగాళ్లు పెద్దగా ఫామ్ లో లేకపోవడంతోనే వారు ఐపీఎల్లో ఆడకపోవడానికి కారణం. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని అంటున్నాడు ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. త్వరలో జరగబోయే ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ నుంచి అధిక సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొంటారని మోర్గాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
'అవును.. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో నాతో పాటు చాలా మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది. మా ఆటగాళ్లు అధిక సంఖ్యలో ఐపీఎల్ గేమ్స్ ఆడతారని ఆశిస్తున్నా. ఒకవేళ మా ఆటగాళ్లు అధిక సంఖ్యలో పాల్గొంటే మాత్రం అది కచ్చితంగా మాకు లాభిస్తుందనడంలో సందేహం లేదు. ఇటీవల కాలంలో మా ఆటగాళ్లు విశేషంగా రాణిస్తుండటం ఐపీఎల్ రేసులో ఉండటానికి కారణం అవుతుంది' అని మోర్గాన్ తెలిపాడు.
వచ్చే ఐదు నెలల్లో స్వదేశంలో జరిగే చాంపియన్స్ ట్రోఫీపై ఇంగ్లండ్ ఆటగాళ్లు దృష్టి పెట్టాలని మోర్గాన్ సూచించాడు. ప్రస్తుతం భారత్ పై ఎదురైన పరాభవాన్ని మరచిపోయి చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధం కావాలన్నాడు. భారత్ లో పిచ్లో చాలా భిన్నంగా ఉంటాయన్న మోర్గాన్.. ఇక్కడ ఫ్రెండ్లీ బ్యాటింగ్ పిచ్లు ఉండటం వల్ల భారీ స్కోర్లు నమోదవుతున్నాయన్నాడు.