
ధోనీ స్టయిల్‌లో మ్యాచ్ ముగించాడు!
సిడ్నీ: బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ టీమిండియా స్టార్ ప్లేయర్ ఎం.ఎస్ ధోనీ స్టయిల్ లో మ్యాచ్ ముగించాడు. అదేనండీ.. చివరి బంతికి అవసరమైన 5 పరుగులను ధోనీ తరహాలో సిక్సర్ కొట్టి మెల్ బోర్న్ స్టార్స్ పై ఉత్కంఠపోరులో విజయాన్ని అందించాడు. నిన్న జరిగిన టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన సిడ్నీజట్టు కెప్టెన్ షేన్ వాట్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్ బోర్న్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఓపెనర్లు మాక్స్‌వెల్(34), లూక్ రైట్(25) మంచి ఓపెనింగ్ ఇచ్చారు. కెవిన్ పీటర్సన్ 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు.
లక్ష్యఛేదనలో బ్యాటింగ్ కు దిగిన సిడ్నీ జట్టు ఓపెనర్ పాటర్ సన్ (28) పరవాలేదనిపించాడు. బ్లిజార్డ్(5), కెప్టెన్ వాట్సన్(3) నిరాశపరిచారు. ఇయాన్ మోర్గాన్ అజేయ హాఫ్ సెంచరీ(50 బంతుల్లో 71 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఇన్నింగ్స్ చివరి నాలుగు బంతుల్లో సిడ్నీ విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. మూడు బంతుల్లో 11 పరుగులే వచ్చాయి. గెలవాలంటే 5 పరుగులు కావాలి. చివరి బంతిని మోర్గాన్ సిక్సర్‌గా మలిచాడు. దాదాపు గెలిచామనుకున్న మెల్ బోర్న్ అనూహ్యంగా ఓడిపోగా.. సిడ్నీ జట్టును గెలిపించిన మోర్గాన్ హీరో అయిపోయాడు. ఎన్నో మ్యాచ్‌లతో సిక్సర్‌తో విన్నింగ్ షాట్ కొట్టి టీమిండియాకు గెలిపించిన ధోనీ తరహాలోనే మోర్గాన్ సిడ్నీ థండర్స్‌కు సిక్సర్ తోనే విజయాన్ని అందించాడు.