
బిగ్‌బాష్ విజేత సిడ్నీ థండర్
* చెలరేగిన ఉస్మాన్ ఖాజా
* ఫైనల్లో మెల్‌బోర్న్ స్టార్స్ ఓటమి
మెల్‌బోర్న్: ఐదో సీజన్ బిగ్‌బాష్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీని సిడ్నీ థండర్ గెలుచుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో మైక్ హస్సీ నాయకత్వంలోని థండర్ 3 వికెట్ల తేడాతో మెల్‌బోర్న్ స్టార్స్‌పై విజయం సాధించింది. ఈ లీగ్ చరిత్రలో థండర్ తొలిసారి విజేతగా నిలవడం విశేషం. చాంపియన్ సిడ్నీ థండర్ జట్టుకు 4 లక్షల 50 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 4 లక్షలు), రన్నరప్ మెల్‌బోర్న్ స్టార్స్‌కు 2 లక్షల 60 వేల డాలర్లు (రూ. కోటీ 75 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
ఫైనల్లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కెవిన్ పీటర్సన్ (39 బంతుల్లో 74; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ షాట్లతో చెలరేగగా, మిగతావారంతా విఫలమయ్యారు. థండర్ బౌలర్లలో వాట్సన్, క్రిస్ గ్రీన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉస్మాన్ ఖాజా (40 బంతుల్లో 70; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో థండర్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఖాజా, జాక్ కలిస్ (27 బంతుల్లో 28; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 55 బంతుల్లోనే 86 పరుగులు జోడించి శుభారంభం ఇవ్వడంతో థండర్ గెలుపు సులువైంది. క్రిస్ లిన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. ఈ విజయం అనంతరం మైక్ హస్సీ బిగ్‌బాష్ సహా ఆస్ట్రేలియా గడ్డపై అన్ని రకాల ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పాడు.
మహిళల టైటిల్ కూడా థండర్‌దే...
మొదటిసారి నిర్వహించిన మహిళల బిగ్‌బాష్ లీగ్ టైటిల్‌ను కూడా సిడ్నీ థండర్ చేజిక్కించుకోవడం విశేషం. ఫైనల్లో థండర్ 3 వికెట్లతో సిడ్నీ సిక్సర్‌ను ఓడించింది. ముందుగా సిక్సర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 115 పరుగులు చేయగా... థండర్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసి నెగ్గింది.