
చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోని (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్ 2018 సీజన్‌లో ఎప్పటి మాదిరే వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌కు దూరమైన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు.. ఎంతో పటిష్టమైన జట్టుగా పేరొందిన చెన్నైసూపర్‌కింగ్స్‌ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా తమ జట్టు పరాజయం పాలవడంపై చెన్నై కెప్టెన్ ధోని స్పందించారు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ధోని.. ఓటమి తనను ఎంతో నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. ‘మేం ఇంకాస్త బాగా బ్యాటింగ్ చేయాల్సింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ చాలా నెమ్మదించింది. దానికి తోడు ఢిల్లీ బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అయినా వికెట్ ఎలా ఉంటుందో ముందుగానే ఊహించడం కష్టం. ఒక్కోసారి మనకు అనుకూలంగా ఉంటుంది. మరోసారి ఇదిగో ఇలా రివర్స్ అవుతుందంటూ’ ధోని వ్యాఖ్యానించారు.
భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. ‘మేము మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. ఓపెనర్లపై పూర్తిగా ఆధారపడకుండా మిడిల్ ఆర్డర్ రాణించాల్సి ఉంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్ల సేవలను వినియోగించుకోలేదు. రానున్న మ్యాచ్‌లలో వారికి అవకాశం లభించవచ్చు. కాబట్టి అందుకు వారు అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలి’ అంటూ ధోని చెప్పారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ బాగా మెరుగుపడాల్సివుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో 18 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్‌లో ఉండగా, సీఎస్‌కే 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే రన్‌రేట్ ప్రకారం సీఎస్‌కే మెరుగైన స్థానంలో ఉండటంతో ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో గెలిచితే టాప్ ప్లేస్‌ను ఆక్రమించాలని ఆశించిన ధోని జట్టుకు నిరాశే మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment