
అందరి ముందు భార్యకు చెప్పులేసిన ధోని..
రాంచీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మరోసారి తన సతీమణి మనసును దోచుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుండటంతో.. విశ్రాంతిలో ఉన్న ధోని.. ఇటీవల తన భార్య సాక్షిసింగ్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. అయితే అక్కడ చెప్పులు పరీక్షించే ప్రయత్నంలో ఇబ్బందిపడ్డ సాక్షికి ధోని సాయం చేశాడు. అతనే స్వయంగా ఆమెకు చెప్పులను వేసాడు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సాక్షి... ‘బిల్లు నువ్వే కట్టావ్‌గా.. షూస్ కూడా నువ్వే వేయ్’ అని కామెంట్ చేసింది. టీమిండియా విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన ధోనీ ఏమాత్రం అహం చూపకుండా.. షాప్‌లో అందరి ముందూ అలా సాక్షికి సాయం చేయడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
2014లో ధోని టెస్టు క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వన్డే, టీ20ల్లోనే కొనసాగుతున్న ధోని.. నిలకడలేమి ప్రదర్శనతో టీ20 జట్టులో కూడా స్థానం కోల్పోయాడు. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అవకాశం కల్పించడంతో గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి ఎంపికైతే మాత్రం వచ్చే ఏడాది జనవరి 12న మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.