
ధోని క్రికెట్ కిట్ విలువెంతో తెలుసా!
మిండియా జట్టులో అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్గా, విజయవంతమైన కెప్టెన్ నిరూపించుకున్న ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. జట్టును ముందుండి నడిపించడంలో, సిక్స్ తో మ్యాచ్ ను ముగించడం ధోని తనదైన మార్కును సొంతం చేసుకున్నాడు.
కోల్ కతా:టీమిండియా జట్టులో అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్గా, విజయవంతమైన కెప్టెన్ నిరూపించుకున్న ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. జట్టును ముందుండి నడిపించడంలో, సిక్స్ తో మ్యాచ్ ను ముగించడంలో ధోని తనదైన మార్కును సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా, సామాజిక సేవలో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన వేలానికి ధోని తన వంతు సాయాన్ని అందించాడు. తన గ్లోవ్స్, ప్యాడ్స్ను అందించి తన ఉదారతను చాటుకున్నాడు.
ఇటీవల నిర్వహించిన వేలంలో ధోని క్రికెట్ కిట్ కు భారీ ధరనే పలికింది. స్పోర్ట్స్ వెబ్ సైట్ ఎక్స్ట్రాటైమ్.ఇన్ నిర్వహించిన వేలంలో ధోని కిట్ను లక్ష రూపాయలకు కొనుగోలు చేశారు. మరోవైపు భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ గెలిచిన రాకెట్స్కు లక్ష యాభైవేల ధర పలికింది.
కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్న బాపీ మాజీ(మోహన్ బగాన్ ఫుట్ బాల్ జట్టు అభిమాని), దీర్ఘకాలికమైన వ్యాధితో బాధపడుతున్న అలిప్ చక్రబొర్తి (ఈస్ట్ బెంగాల్ ఫుట్ బాల్ అభిమాని) కుటుంబానికి సహాయం అందించేందుకు క్రికెట్ వెబ్ సైట్ ద్వారా వేలం నిర్వహించారు. దీనికి మహేంద్ర సింగ్ ధోని, లియాండర్ పేస్లతో పాటు పలువురు ముందుకొచ్చారు. ఈ వేలం ద్వారా ఇప్పటివరకూ వచ్చిన రూ.14 లక్షల మొత్తాన్ని ఆయా కుటుంబాలకు అందించినట్లు సదరు వెబ్ సైట్ వెల్లడించింది.