ఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. పలు పర్యాటక కేంద్రాలను సందర్శిస్తూ కుటుంబంతో బిజీగా గడుపుతున్నాడు. ఈ మధ్యనే మాల్దీవులకు వెళ్లిన ధోని.. అక్కడ అందాలను ఆస్వాదించాడు ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు ఆర్‌పి సింగ్, పీయూష్ చావ్లాలను కలిసిన ధోని వారితో సరదాగా గడిపాడు. ఓ పానీపూరి స్టాల్ దగ్గర నిలబడిన ధోని.. అక్కడున్న పదార్థాలను తీసుకుని పానీపూరిని తయారు చేసి ఆర్‌పీ సింగ్, చావ్లాలకు అందించాడు.
ఇదిలా ఉంచితే, తాజాగా ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ అభిమానుల్లో మరింత జోష్‌ను తీసుకొచ్చింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని కన్హా పులుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ధోని.. తనలోని ఫొటోగ్రాఫ్ కళను బయటకు తీశాడు. కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లిన ధోని.. అక్కడ పులులను ఫొటోలు తీస్తూ ఆహ్లాదంగా గడిపాడు. ఆ నేషనల్ పార్క్‌లో ఉన్న పులిని ఒక ఫొటోలో బంధించి అభిమానులకు షేర్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. దానికి అభిమానుల నుంచి విశేషణ స్పందన లభిస్తోంది. దీనిలో భాగంగా ధోని ఫోటోకు ఒక అభిమాని ఇచ్చిన రిప్లే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక పులిని మరొ పులి ఫోటో తీసిందంటూ కామెంట్ చేశాడు. ధోనిని పులితో పోల్చడంతో అది ఇంకా వైరల్‌గా మారింది. గత జనవరిలో కన్హా పులుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించగా అక్కడ తీసిన ఫొటోనే తాజాగా షేర్ చేశాడు.
2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత ధోని అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ధోని పునరాగమనంపై ఇప్పటికే పలు రకాలు రూమర్లు చక్కర్లు కొట్టినా, టీ20 వరల్డ్‌కప్‌కు అందుబాటులో ఉంటాడని మరో వాదన వినిపిస్తోంది. అయితే ఇటీవల భారత క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ధోని పేరును తొలగించారు. ధోనికి ఏ కేటగిరీలోనూ బీసీసీఐ చోటు కల్పించలేదు. ఫలితంగా ధోని శకం ముగిసిందంటూ రకరకాల కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో అంటే ధోనిని కాంట్రాక్ట్ నుంచి తొలగించిన రోజు ధోని మళ్లీ బ్యాట్ పట్టాడు. రాంచీలో జార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి వైట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment